Harish Tweet On Rahul: తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో విమానాశ్రయంలో దిగగానే అర్థమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్విటర్ ద్వారా సెటైర్లు వేశారు. పంజాబ్ రైతులు నమ్మని డిక్లరేషన్.. చైతన్యమున్న తెలంగాణ రైతులు నమ్ముతారా? అని ప్రశ్నించారు. వరంగల్లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్ సంఘర్షణ సభ అని ఎద్దేవా చేశారు.
వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతులే కాంగ్రెస్ను ఈడ్చి తన్నారని హరీశ్ రావు అన్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఏం మాట్లాడాలి.. సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెరాస మాత్రమేనని హరీశ్ రావు ట్వీట్ చేశారు.