Harish Rao Speech in Telangana Legislative Assembly :రాష్ట్ర శాసనసభ సమావేశంలోని తొలిరోజే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం గొంతు నొక్కి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగానికి(Governor Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాటలకు హరీశ్‌రావు మీడియాముఖంగా ఘాటుగా స్పందించారు.
రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ - శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ
కాంగ్రెస్ నేతలు ఎన్నికల సభల్లో చెప్పినట్లే, శాసనసభలోనూ పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఉద్యమకారుల విషయంలో రేవంత్‌రెడ్డిది మొసలి కన్నీరని అన్నారు. నాడు పీవీ నర్సింహారావును దిల్లీ నాయకత్వం అవమానిస్తే, నోరు విప్పలేదని హరీశ్‌రావు అన్నారు. ఆనాడు టి.అంజయ్యను రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) ఎలా అవమానించారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని హరీశ్‌రావు విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా? మీ పేరే రైఫిల్ రెడ్డి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని, జై తెలంగాణ అన్నవాళ్లకు కాల్చి వేస్తానని చెప్పారు. ఉద్యమకారులపైకి తుపాకి గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. మీరు తెలంగాణ ఉద్యమకారులకోసం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది, సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తింది మీరు. ఇవాళ నీకేదో ఉద్యమకారులపై ప్రేమ ఉన్నట్లు శాసనసభలో మొసలి కన్నీరు కారుస్తున్నావు.-హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే