Harishrao Letter: రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రానికి మరోమారు లేఖ రాశారు. గత నెల 24న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన హరీశ్ రావు.. తాజాగా మళ్లీ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు. విభజనచట్టంలో పేర్కొన్న విధంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు చెందిన రెండేళ్ల బకాయిలైన 900 కోట్లు వెంటనే విడుదల చేయాలని... 2021-22 తర్వాత కూడా మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
వెంటనే విడుదల చేయాలి..
నీతిఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రానికి రూ.24,205 కోట్లు ఇవ్వాలని కోరారు. 15వ ఆర్థికసంఘం స్థానికసంస్థల కోసం సిఫారసు చేసిన 817 కోట్ల గ్రాంటును కేంద్రం అకారణంగా తిరస్కరించిందన్న హరీశ్ రావు... రాష్ట్రం అన్ని నిబంధనలను పాటించినందున ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గినందున 723 కోట్ల ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని కూడా 15వ ఆర్థిక సంఘం సూచించిందన్న ఆయన... ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని కోరారు.