Telangana Qualitative Development in Medical Field: కేంద్రం మొండిచేయి చూపినా, అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఒక్క ఏడాదే 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామన్న ఆయన.. వైద్యవిద్యలో తెలంగాణ గుణాత్మకమైన అభివృద్ధిని సాధించిందన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగినవాటికి మంత్రి సమాధానమిచ్చారు.
ఆరేడేళ్లలోనే మూడింతల వైద్య సీట్లను పెంచుకున్నామని తెలిపారు. కేంద్రం ఏర్పాటు చేసిన బీబీనగర్ ఎయిమ్స్‌లో నాలుగేళ్ల తర్వాతైనా కనీస వసతులు లేవన్న మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో నర్సింగ్, పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి అన్నారు. పారామెడికల్ కళాశాలల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు.
Development of Telangana in medical field: అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తామని.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు. నెలలోగా 1,457 అసిస్టెంట‌్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మెదక్‌లో వైద్యకళాశాల నిర్మిస్తామని తెలిపారు. అలాగే గోల్కొండలో కూడా కొత్త ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రతి జిల్లాకు వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ వచ్చాక వైద్యకళాశాలల్లో సీట్లు మూడింతలు పెరిగాయన్నారు. ఒకే ఏడాది 8 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వనిదేనని ఆనందం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తిలో వైద్యకళాశాలలు వస్తున్నాయన్నారు. ప్రతిపక్ష సభ్యులున్న సంగారెడ్డి, ములుగులోనూ వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తోందని, మన రాష్ట్రానికి మాత్రం ఒక్క వైద్య కళాశాలను కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు.
ఇవీ చదవండి: