రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులు మంత్రికి వివరించారు.
బ్రిటన్ మహిళకు నెగెటివ్
Omicron Nagative: రిస్క్ ఉన్న దేశాల నుంచి రాష్ట్రానికి 1,805 మంది వచ్చారని.. వారిలో 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన బ్రిటన్ మహిళకు ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. మిగతా 12 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు.
రెండు డోసులు తీసుకోవాలి
Vaccination in TS: వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలన్న హరీశ్ రావు... ముఖ్యంగా రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని చెప్పారు. రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపవద్దన్న ఆయన... ఇతర వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం
harish rao on covid rules: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, కాళోజీ విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.