Harish rao Review On Power: తెలంగాణ ఏర్పడితే చీకట్లే అన్న మాటలు తప్పని నిరూపిస్తూ.. నేడు నిరంతర విద్యుత్‌తో వెలిగిపోతోందని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ విద్యుత్ ఒప్పంద సామర్థ్యం 7వేల 778 మెగావాట్లు ఉండగా గడిచిన ఏడేళ్లలో 16వేల 623 మెగావాట్లకు పెంచినట్లు తెలిపారు. ఏడేళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టీకరణ కోసం 33వేల 722 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. విద్యుత్ శాఖ తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇటీవలే ఏఆర్ఆర్ ప్రతిపాదనలను ఈఆర్సీకీ సమర్పించాయి.
Harish on power company's: విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ - వ్యయాల వ్యత్యాసం ఆ సంస్థలపై ప్రభావం చూపుతుందని వివరించాయి. ఈ లోటు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు చర్చించారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ల రెవెన్యూ లోటు 2021-22 ఏడాదికి రూ.10,624 కోట్లు, 2022-23కి 10,928 కోట్లు వచ్చినట్లు సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. బొగ్గు ధరలు, క్లీన్ ఎనర్జీ ఛార్జీల పెరుగుదల, ఉద్యోగులకు రెండు సార్లు వేతన సవరణ, మూడేళ్లుగా ఛార్జీలు పెంచకపోవడం వంటి కారణాలతో రెవెన్యూలోటు పెరిగినట్లు వివరించారు. గత నాలుగేళ్లలో కేవలం ఉద్యోగుల వేతనాలే సుమారు రూ.5 వేల కోట్లకు చేరుకున్నాయని డిస్కంల సీఎండీలు, ట్రాన్స్-కో జెన్కో సిఎండీ ప్రభాకర్ రావులు మంత్రులకు వివరించారు.