Harish Rao postcard request Nregs on mgnregs: ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పోస్ట్ కార్డు ద్వారా విజ్ఞప్తి చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన పోస్టుకార్డుల ఉద్యమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో ఉపాధిహామీపై కేంద్రానికి మంత్రి పోస్టుకార్డు రాశారు. ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. అందువల్లే బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కోత విధించారని ఆరోపించారు.
కూలీలకు పనిదినాలు తగ్గడంతో పాటు రోజుకు 257 రూపాయలు ఇవ్వాలని ఉపాధి హామీ చట్టంలో ఉన్నప్పటికీ.. వంద రూపాయలు కూడా వేతనం రావడం లేదని అన్నారు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్న హరీశ్ రావు.. కనీస వేతన చట్ట ప్రకారం ఎనిమిది గంటలు పని చేసిన కూలీకి 480 రూపాయలు ఇవ్వాలని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఆక్షేపించారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి: వ్యవసాయాన్ని అనుసంధానిస్తే రైతులకు కూలీ గిట్టుబాటు అవుతుందన్న మంత్రి.. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం వంద రోజులు పని దినాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు ఏపీఓల వరకు ఉపాధిహామీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని హరీశ్ రావు పోస్టు కార్డులో రాశారు.
వేతన దారులకు తప్పని తిప్పలు: గ్రామీణ ప్రాంతంలో వలసలు నివారణనే లక్ష్యంగా 2005లో తీసుకొచ్చిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తరువాత ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి చెరువులు బాగు చేసుకోవడం, చెరువులో పూడికలు తీయడం, కాలువలు బాగు చేసి తద్వారా వేతన దారులకు డబ్బులు చెల్లిస్తున్నారు.
ఆ తరువాత పథకంలో కొన్ని సవరణలు చేసి పని దినాలు పెంచిన.. వేతన డబ్బులు పెంచిన.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్షేత్ర స్థాయిలో వేతన దారులకు పనికి తగిన వేతనం లభించడం లేదు. ఈ మధ్య కాలంలో రెండు పూటలు పని చేస్తున్న రోజు వారి కూలీ లభించడం లేదని వేతన దారులు వాపోతున్నారు. నిరుడు వేసవి కాలంలో మండుటెండలో పని చేస్తోన్న కూలీలకు కనీస సౌకర్యాలు అందడం లేదు.