సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ప్రధానపార్టీలకు కీలకంగా మారింది. ఎవరికి వారు విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగారు. కాంగ్రెస్, భాజపా తమ రాష్ట్ర నాయకులందరినీ దుబ్బాకలో దింపాయి. భారీ మోజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న హరీశ్ రావు.. వ్యక్తిగతంగా ప్రత్యేక నిఘా బృందాన్ని రంగంలోకి దింపారు. తన ముఖ్య అనుచరుడికి ప్రత్యేక నిఘా బాధ్యతలు అప్పగించారు. అతని ఆధ్వర్యంలో 30 మంది యువకులు రంగంలోకి దిగారు.
గ్రామాల వారీగా నివేదిక
ప్రతి రోజు ఒక్కో మండలానికి బృందంలోని ఆరుగురు సభ్యులు వెళ్తారు. ఆ మండల పరిధిలోని గ్రామాల్లో సాధారణ ప్రజల్లా పర్యటించి.. గ్రామంలో తమ పార్టీ పరిస్థితి.. నాయకుల మధ్య సమన్వయం, ఎవరికి గ్రామంలో పట్టు ఉంది.. ప్రచారంలో లోపాలు.. సవరించుకోవాల్సిన అంశాలు వంటి సమాచారం సేకరిస్తున్నారు. ప్రతిపక్షాల బలాలు, బలహీనతలు గుర్తిస్తున్నారు. ఇతర పార్టీ నాయకుల కదలికలు.. వారి నుంచి తమ పార్టీ కార్యకర్తలకు వచ్చే ప్రలోభాలపైనా నిఘా పెడుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆ వివరాలను గ్రామాల వారీగా నివేదిక రూపొందించి హరీశ్ రావుకు అందిస్తున్నారు.