Telangana Budget Sessions 2023-24: వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్ పోవాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లు కూడా 85 శాతం స్థానికులకే అని పేర్కొన్నారు. 157 వైద్య కళాశాలలు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
కంటి వెలుగును చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి 8 శాతం నిధులు పెంచామని వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో 3.5 శాతం మాత్రమే పెంచారని గుర్తు చేశారు. తెలంగాణలో రూ.3,532 తలసరి వైద్యం ఖర్చు అని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులకు పేదలు వెళ్లకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగరేణి సహకారంతో రామగుండంలో వైద్య కళాశాల నిర్మిస్తామని వివరించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
"రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతం నిధులు పెంచాం. కేంద్ర బడ్జెట్‌లో 3.5 శాతం మాత్రమే పెంచారు. తెలంగాణలో రూ.3,532 తలసరి వైద్యం ఖర్చు. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తాం. ప్రైవేట్ ఆస్పత్రులకు పేదలు వెళ్లకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. సింగరేణి సహకారంతో రామగుండంలో వైద్య కళాశాల నిర్మిస్తాం. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం."-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి