Harish rao on Health: దేశంలో వైద్య రంగంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రం అని మరోసారి రుజువైంది. 'సార్వత్రిక ఆరోగ్య దినోత్సవం - 2021'ను పురస్కరించుకుని రెండు కేటగిరీల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 'హెల్దీ అండ్ ఫిట్నేషన్' క్యాంపెయిన్ ప్రారంభించింది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 13 వరకు జరిగిన ఈ ప్రచారోద్యమంలో ఆరోగ్య ఉపకేంద్రం స్థాయిలో మూడు లక్ష్యాలు నిర్దేశించింది. ఒక సబ్ సెంటర్ పరిధిలో కనీసం 100 మందికి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ చేయడం, 10 వెల్నెస్ యాక్టివిటీస్ నిర్వహించడం, కనీసం 100 డిజిటల్ ఐడీలు సృష్టించడం వంటివి. వీటిలో తెలంగాణ వెల్నెస్ యాక్టివిటీస్‌లో దేశంలో మొదటి స్థానంలో, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది.
వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్ అభినందనలు
harish rao on health and fit nation compaign: రాష్ట్రంలో ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో వైద్య సిబ్బంది ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చేతుల మీదుగా రాష్ట్ర సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు. హెల్త్ ఛాంపియన్‌గా తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.