Minister Harish Rao letter to Central Minister Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మంత్రి హరీశ్ రావు ఈ లేఖలో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేళ్ల బకాయిలు రూ. 900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందని హరీశ్.. లేఖలో పేర్కొన్నారు. వీటిని విడుదల చేయడంతో పాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరారు. నీతిఆయోగ్ సూచించిన మేరకు రూ. 24,205 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలకు రూ. 817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఎందుకు తిరస్కరించిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారని ఆరోపించారు. వీలైనంత త్వరగా గ్రాంట్లు విడుదలయ్యేలా చూడాలని అభ్యర్థించారు.
ఎప్పుడూ తిరస్కరించలేదు
'స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఎందుకు తిరస్కరించిందో అర్థం కావడంలేదు. ఆర్థిక సంఘం సిఫారసులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ నిధులను మంజూరు చేయండి. 2014- 15లో తెలంగాణకు రావాల్సిన వాటాను.. కేంద్రం పొరపాటున ఏపీకి విడుదల చేసింది. ఆ నిధులను మాకు విడుదల చేయండి.'అని హరీశ్ లేఖలో పేర్కొన్నారు.