Harish Rao Inaugurates Robotic Surgery Equipments at MNJ Hospital in Hyderabad: క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ పరికరాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దేశంలోనే మూడో అతిపెద్ద క్యాన్సర్ ఆస్పత్రిగా అవతరించిందని కొనియాడారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రి(MNJ Hospital)లో రూ.34 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలు ఉన్న రోబోటిక్ సర్జరీ పరికరాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా ఎంతో మంది రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్లు సైతం ఎంఎన్‌జే వైద్యశాలల్లో నిర్వహిస్తున్నారని వివరించారు. క్యాన్సర్‌తో అవసానదశలో బాధపడుతున్న వారి కోసం పాలియేటివ్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
MNJ Cancer Hospital in Hyderabad: ఎంఎన్‌జే ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని.. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద క్యాన్సర్ ఆస్పత్రి ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అని తెలిపారు. 371 మంది క్యాన్సర్ ఉన్న మహిళలను ఈ ఆసుపత్రిలో చేర్పించామని వివరించారు. క్యాన్సర్‌కు చికిత్స(Cancer Treatment) అందించడంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగాఉందని చెప్పారు. రోగులకు హోమ్ కేర్ సర్వీస్‌నూ అందిస్తున్నామన్న విషయం గుర్తు చేశారు.
Robotic Equipments in MNJ Cancer Hospital: క్యాన్సర్ రోగుల చికిత్స కోసం రూ.900 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తున్నామని అన్నారు. గతంలో ఈ ఆసుపత్రిలో మూడు థియేటర్లు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. అవి కూడా 60 సంవత్సరాల క్రితం ప్రారంభించినవని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఎంఎన్‌జే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఆలోచించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసేందుకు రూ.120 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.