Harish Rao Give Clarification on Telangana Debts : ఎన్ని శ్వేత పత్రాలు పెట్టినా, ఎన్ని అంశాలు చర్చించినా మేము సమాధానం ఇచ్చేందుకు సిద్దమని, రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. స్వల్పకాలిక చర్చకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన సమాధానంపై వివరణలు కోరిన ఆయన, సత్య దూరమైన విషయాలు చెప్పారని ఆక్షేపించారు. రాష్ట్ర అప్పులు ఏడు లక్షల కోట్లు అని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎస్పీవీల లోన్లు మినహాయిస్తే అప్పు(Telangana Debts) రూ.5,16,881 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు వివరించారు. రానున్న మూడు నెలలది తీసివేస్తే ఐదు లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. సొంత ఆదాయ వనరుల్లో వృద్ధి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అంతేగానీ ఆస్తుల విలువ, జీఎస్‌డీపీ, పంటల ఉత్పత్తి, తలసరి ఆదాయం వంటి విలువలను చెప్పలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కరోనా, పెద్ద నోట్ల రద్దు(Demonetization), కేంద్ర సహాయ నిరాకరణ కారణంగా అంచనాలు, ఖర్చు విషయంలో అంతరం పెరిగిందని అన్నారు. నాటి పాలనలో సగంలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఆర్‌బీఐ ఇచ్చిన అవకాశాన్ని తీసుకున్నామని వివరించారు.
శ్వేతపత్రం మమ్మల్ని బద్నాం చేసేందుకేనన్న బీఆర్ఎస్ - వాస్తవాలు ప్రజలముందుంచామన్న అధికారపక్షం