తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నాం - లేదంటే చీల్చి చెండాడేవాళ్లం'

Harish Rao Fires on Congress Party : రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్‌ లోక్‌సభ సన్నాహక సమావేశంలో నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. హామీల అమలుపై ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నామని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Harish Rao Comments on Bandi Sanjay
Harish Rao Fires on Congress Party

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 4:33 PM IST

Harish Rao Fires on Congress Party : అధికారంలోనే కాదు, ప్రతిపక్షహోదాలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడదామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్‌(BRS) లోక్‌సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని పేర్కొన్నారు.

రోగాలు నయం చేసే వైద్యులు ఎంత గొప్పవారో, పరిసరాల శుభ్రతకు పాటుపడే కార్మికులూ అంతే గొప్ప : హరీశ్​రావు

రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల 90 వేల కోట్లేనని, అధికారం కోసం కాంగ్రెస్‌ పార్టీ అంతకు మించిన హామీలిచ్చారని హరీశ్‌రావు(Harish rao) మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇష్టమొచ్చిన విధంగా హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారని ఆక్షేపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపే తెలంగాణ సమస్యలకి పరిష్కారమన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేది పోయి కాంగ్రెస్ నాయకులు, దిల్లీలో ప్రతి రోజూ బీజేపీ నాయకుల మెడలకు దండలు వేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. బండి సంజయ్ కాంగ్రెస్, బీజేపీ మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారని, కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని ఈ బ్రహ్మజ్ఞాని సెలవిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర, పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేనని బండి సంజయ్ చెబుతున్నారని అన్నారు.

ఆటో కార్మికులకు నెలకు 15 వేల జీవన భృతి ఇవ్వాలి : హరీశ్​ రావు

Harish Rao Comments on Bandi Sanjay :బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని హరీశ్‌రావు గుర్తు చేశారు. బండి సంజయ్ వార్తల్లో ఉండేందుకు లొట్టపిట్టలా తాపత్రయ పడతారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటించి బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న హరీశ్‌రావు, నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని అన్నారు.

నీతి ఆయోగ్ నివేదికతోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. దావోస్‌కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది, పెట్టుబడులకు రావొద్దని చెప్పదలుచుకుందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడేమంటారని ప్రశ్నించారు.

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యరాజకీయాలు మొదలుపెడుతోందని, ఇది మంచిది కాదని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నామన్న హరీశ్‌రావు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమని అన్నారు. కొన్ని రోజులైతే బీఆర్‌ఎస్‌ నేతలు ఇంట్లో కూర్చున్నా, రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలం : హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details