Harish Rao Fires on Central Government: సీఎం కేసీఆర్‌కు పదవులు గడ్డిపోచతో సమానమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతి, రాష్ట్రం కోసం ఆయన నాయకత్వాన్ని అందరమూ బలపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించాలని సెర్ప్ ఉద్యోగులను కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సెర్ప్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం తమకు పే స్కేలు ప్రకటించినందుకు కృతజ్ఞతగా సెర్ప్ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంచినీటి కోసం మహిళలు బిందె పట్టుకోని పరిస్థితి చాలదా.. కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేసేందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ప్రజాసమస్యలు లేవని.. అందుకే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
వేగంగా ఆలోచించే నాయకుడు కేసీఆర్: ప్రజలకు ఏం కావాలో ప్రతిపక్షాల కంటే వేగంగా ఆలోచించే నాయకుడు కేసీఆర్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను దిల్లీలో అవార్డులు ఇస్తారు.. కానీ, గల్లీలో మాత్రం విమర్శిస్తారని ఎద్దేవా చేశారు. కేంద్రం కక్ష, కుట్రతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపుతోందని ఆరోపించారు. దేశమంతా వైద్య కళాశాలలు ఇచ్చి రాష్ట్రానికి ఇవ్వలేదని దుయ్యబట్టారు. డబుల్ ఇంజిన్ అంటారని.. కానీ కర్ణాటకలో ఇచ్చే ఫించను రూ.600 మాత్రమేనని హరీశ్‌రావు వివరించారు.
దేశంలో అమలు చేస్తున్నారు: తెలంగాణ పథకాల పేర్లు మార్చి దేశంలో అమలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని విమర్శించారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీని కూడా ఆరేడేళ్లుగా కేంద్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు.