Hamstech Interior Design Expo : హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో హామ్స్టెక్ విద్యార్థులు.. ఇంటీరియర్ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్పేస్ స్టోరీస్ పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన పలు రకాల ఇంటీరియర్ డిజైన్లు చూపరులను మంత్రమగ్ధులను చేస్తున్నాయి. ఇందులో సోఫా సెట్స్, హోంలైట్స్ విభిన్న రకాలుగా రూపొందించి ఔరా అనిపించారు. దాదాపు 300 మంది విద్యార్థులు.. 1000కి పైగా ఉత్పత్తులను ప్రదర్శించి శభాష్ అనిపించారు.
చాలా మంది యువత సృజనాత్మకత రంగాన్నే తమ కెరియర్‌గా ఎంచుకుంటారని.. అందులోనూఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులపై.. ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారని హామ్స్టెక్ ఇనిస్టిట్యూట్ ఎండీ అజితారెడ్డి అన్నారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే ఈ ఉత్పత్తులను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆమె తెలిపారు.
వార్షికోత్సవంలో భాగంగా ప్రతీ ఏడాది ఇంటీరియన్ డిజైన్ ప్రదర్శన నిర్వహిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు శ్రమించి వీటిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇంటీరియర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. కేవలం వారం రోజుల సమయం ఇచ్చి.. ఒక థీమ్ ఇస్తారని పేర్కొన్నారు. దీని ద్వారా విభిన్న రకాలుగా డిజైన్‌లు చేయడం నేర్చుకుంటారని.. ఇలా ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా మార్కెట్ విధానం తెలుస్తుందని విద్యార్థులు వెల్లడించారు.