మార్చి 4న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,339 పరీక్ష కేంద్రాల్లో, ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్, 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వెల్లడించారు.
హాల్‌టికెట్లు ఆపవద్దు
మొదటి సంవత్సరంలో 4,80,516 మంది, రెండో సంవత్సరం 4,85,323 మంది కలిపి మొత్తం 9,65,839 మంది ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నట్లు చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్స్ తమ లాగిన్ ఐడీ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించలేదని, మరే ఇతర కారణాలతో విద్యార్థులకు హాల్‌టికెట్లను ఆపవద్దని కళాశాల యాజమాన్యానికి స్పష్టం చేశారు.
తప్పులుంటే సరిచేసుకోండి
విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి నేరుగా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని చిత్రా రామచంద్రన్ తెలిపారు. హాల్‌టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేదని... దానిపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లు పూర్తిగా పరిశీలించి.. తప్పులుంటే కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా సరిచేసుకోవాలని ఆమె సూచించారు.