Halfway schools in Telangana : వేసవి వచ్చేసింది. ఫిబ్రవరి నుంచే మొదలైన ఎండలు.. మార్చి వచ్చేసరికి మరింత మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. కళాశాలలు, ఆఫీసులకు వెళ్లే వారంతా ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ జామ్‌తో మరింత అవస్థలు పడుతున్నారు. ఇక పిల్లలను ఎండాకాలంలో స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.
Halfway schools in Telangana from March 15th : ఈ ఏడాది ఎండలు మరింత ముదరనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. మార్చిలోనే మే నెలను తలపించేలా సూర్యుడి భగభగలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అందుకే ఏవైనా శుభకార్యాలు.. ఇతర ఈవెంట్లు ఉంటే మార్చి నెలలోనే జరుపుకోమని సూచించారు. ఇక ఏప్రిల్, మే నెలలో ఉక్కపోత కూడా విపరీతంగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
మార్చి నెల వచ్చేసింది. ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి. ఇక ఎప్పుడెప్పుడు ఒంటిపూట బడి నడుపుతారని ఎదురుచూస్తున్న పిల్లలకు.. వారి తల్లిదండ్రులకు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ బడులు ఒంటిపూట నడపాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే దీనికి మరో నాలుగు రోజులే ఉండటం.. ఇంకా దీనిపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సందిగ్ధత నెలకొంది.
ఒంటిపూట బడులపై రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోయినా.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు నడుస్తాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం మార్చి 14న ఒంటిపూట బడులపై రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా ఒక్కరోజు ముందే (మార్చి 14) ఉత్తర్వులు జారీ చేస్తారేమోనని పాఠశాలల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
ఒంటిపూట బడుల టైం టేబుల్..మార్చి 15 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అన్ని పాఠశాలలు పనిచేస్తాయి. సర్కార్, ఎయిడెడ్ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఒంటిపూట బడులు ఎలా జరపాలన్న సందిగ్ధత ఉపాధ్యాయుల్లో నెలకొంది. దానిపై స్పష్టత ఇవ్వాలని పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖను కోరుతున్నాయి. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ ఏం చేస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.