రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా సర్కార్.. మరిన్ని చర్యలకు సిద్ధమైంది. కరోనా బాధితులకు సత్వర వైద్యం అందేలా కార్పొరేట్ ఆసుపత్రుల్లోని కొవిడ్ పడకల్లో సగం సర్కార్ తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలనుకునే వారి సౌకర్యార్థం యాప్‌ను రూపొందించనుంది. తద్వారా పారదర్శకత పద్ధతిలో పడకలను పొందే వీలు కలగనుంది. మిగిలిన 50 శాతం పడకలను ఇష్టానుసారం ఆసుపత్రులు కేటాయించుకోవచ్చు.
ఆదివారం వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సగం పడకలు తమ పర్యవేక్షణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించగా కార్పొరేట్ ఆసుపత్రులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
కార్పొరేట్ ఆసుపత్రుల నియంత్రణకు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించనుంది. ఆయా ఆసుపత్రుల్లో సగం పడకల కేటాయింపు ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు నిర్దేశించిన ధరలు వాటిలో అమలు చేయనున్నారు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఇతర ఖరీదైన ఔషధాలకయ్యే ఖర్చు బాధితులు భరించాల్సి ఉంటుంది.