తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మించారు... నిర్వహణ మరిచారు

హైదరాబాద్​లో బల్దియా ఏర్పాటు చేసిన 'ప్రతి డివిజన్​కు ఓ జిమ్' కార్యక్రమం అటకెక్కింది. సగానికి పైగా వ్యాయామశాలలు తెరుచుకోకపోగా....మిగిలిన వాటిలో పరికరాలే లేవు.  కొన్నింట శిక్షకులు కరవైతే కొన్నిచోట్ల నిర్వహణ శూన్యం. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వ్యాయామశాలల్లో కనీస  సదుపాయాలు లేవని నగరవాసులు అంటున్నారు.

నిర్మించారు... నిర్వహణ మరిచారు

By

Published : Aug 13, 2019, 11:45 PM IST

నిర్మించారు... నిర్వహణ మరిచారు

భాగ్యనగరాన్ని ఆరోగ్య రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా ప్రతీ డివిజన్‌కు ఓ వ్యాయామశాలను ఏర్పాటుకు పూనుకుంది. 2016లో నగరంలోని 150 డివిజన్లలో జిమ్‌ల ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టింది. స్థలం కొరత... ఇతరత్రా కారణాలతో 15 వార్డుల్లో ఏర్పాటు చేయలేకపోయినా మిగిలిన 135 వార్డుల్లో ఏర్పాటు చేశారు. వీటి నిర్వహనను స్థానిక కార్పొరేటర్​కు కానీ.. స్థానిక కాలనీ సంక్షేమ సంఘానికి బల్దియా అప్పగించింది. వ్యాయామశాలు ఆర్భాటంగా అయితే ప్రారంభించారు కానీ కొన్ని రోజులకే ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. సగానికి పైగా వ్యాయామశాలలు కనిపించకుండాపోగా.. మరికొన్నింట్లో పరికరాల జాడేలేదు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.5 కోట్లతో ప్రారంభించిన కార్యక్రమం కాస్త నీరుగారిపోయింది.

పట్టించుకునే నాథుడేడి

శిక్షకుల పర్యవేక్షణలో కసరత్తులు చేసేందుకు వారిని నియమించే బాధ్యతనూ కార్పొరేటర్లకే అప్పగించి పరికరాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం చాలా వ్యాయమశాలల్లో శిక్షకులు లేక వాటిని పట్టించుకునే నాథుడే కరవయ్యారు. కొన్నిచోట్ల అసౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నగర వాసులు అంటున్నారు.

ఎక్కడెలా ఉన్నాయి

నగరంలోని చైతన్యపురి డివిజన్‌లో జిమ్‌ పరికరాలు అమర్చడానికి భవనం లేదంటూ జిమ్​ సామగ్రిని మూలన పడేశారు. చంపాపేట డివిజన్‌ పరిధి కర్మన్‌ఘాట్‌లోని క్రాంతిక్లబ్‌లో ఇప్పటికీ జిమ్‌ను ప్రారంభించలేదు. హస్తినాపురం డివిజన్‌కు మంజూరైన జిమ్‌ను సాగర్‌రోడ్డులోని అనుపమానగర్‌ కాలనీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సరైన పరికరాలు లేవంటూ యువకులు రావడం మానేశారు. లింగోజిగూడ డివిజన్‌కు చెందిన వ్యాయామశాలకు ఇప్పటి వరకు తాళం తీయలేదు. వనస్థలిపురంలో పలు జిమ్‌లను ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులే సొంత ఖర్చుతో నడిపిస్తున్నారు. కూకట్​పల్లి సర్కిల్​లోని వివేకనందానగర్, మూసాపేట్ డివిజన్, బాలజీనగర్​ వ్యాయామశాలలు మూతపడ్డాయి.

ఇదొక్కటే కాస్త మెరుగు

మొత్తం అన్ని డివిజన్లలో కంటే జవహర్‌నగర్‌ సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన వ్యాయామశాల ఒక్కటే అనుకున్న రీతిలో కొనసాగుతోంది. దేహదారుఢ్య పోటీల్లో సత్తాచాటిన గుండు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యువత శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ కూడా అరకొర సౌకర్యాలతోనే నెట్టుకొస్తున్నామంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ స్పందించి వ్యాయామశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నగర వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: అంకితభావంతో సేవచేసే సంస్థలకే ప్రజల గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details