తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్​కు దీటుగా దూసుకెళ్తున్న గురుకులాలు - Telangana Gurukulas news

ఆరేళ్ల తెలంగాణలో గురుకుల విద్యకు అధిక ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్న 298 గురుకుల విద్యా సంస్థలు.. ఆరేళ్లలో 959కి చేరాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పలు పాఠశాలలు, కాలేజీల్లో ఏటా ఒక తరగతి పెంచుతూ పోతున్నందున.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల 72 వేల విద్యార్థుల సంఖ్య.. ఐదేళ్లలో సుమారు 4 లక్షల 74 వేలకు చేరనుంది. ఒక్కో విద్యార్థిపై ఏటా సుమారు లక్షన్నర రూపాయలు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

gurukulam colleges rumbling in telangana
కార్పొరేట్​కు దీటుగా దూసుకెళ్తున్న గురుకులాలు

By

Published : Jun 2, 2020, 5:02 AM IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడక ముందే 298 ఉండేవి. ఆరేళ్లలో కొత్తగా 661 పాఠశాలలు... మరో 53 డిగ్రీ కళాశాలలు ఏర్పడ్డాయి. వాటిలో సగం బాలికల కోసం ప్రభుత్వం కేటాయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 72 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుతున్నందున.. ఐదేళ్లలో విద్యార్థుల సంఖ్య 4 లక్షల 74 వేల 240కి చేరనుంది. ఒక్కో విద్యార్థిపై ఏటా సుమారు లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

గణనీయంగా పెరిగాయి..

రాష్ట్రంలో మైనారిటీ గురుకులాలు 12 నుంచి 204కి చేరాయి. వీటిల్లో 57 వేల 980 విద్యార్థులు చదువుతున్నారు. ఐదేళ్లలో విద్యార్థుల సంఖ్య లక్షా 30 వేలకు చేరనుంది. ఈ విద్యా సంవత్సరం హైదరాబాద్​లోని 8 మైనారిటీ గురుకులాలల్లో ఇంటర్ విద్యను అందించేందుకు జూనియర్ కాలేజీలుగా అప్​గ్రేడ్ చేశారు. ఆరేళ్లలో రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యాలయాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ఆవిర్బావానికి ముందు రాష్ట్రంలో 19 బీసీ గురుకులాలు ఉన్నాయి. రాష్ట్ర అవతరణ అనంతరం ప్రభుత్వం కొత్తగా 261 గురుకులాలు, ఓ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యా సంస్థల సంఖ్య 281కి చేరింది.

వేల మంది చదువుతున్నారు..

ప్రస్తుతం 39 వేల 924 మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాలు అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఉమ్మడి రాష్ట్రంలో 134 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు ఉండగా.. తెలంగాణ వచ్చాక మరో 104 పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలలు ఏర్పడ్డాయి. ఎస్టీ గురుకులాలు రాష్ట్రావిర్భానికి ముందు 51 ఉండగా.. తర్వాత కొత్తగా 51 పాఠశాలలు, 22 డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో.. మొత్తం సంఖ్య 169కి చేరాయి. ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులకు మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ విద్యార్థులు ప్రతిభను చాటారు. గురుకుల విద్యార్థులు సుమారు 80 శాతానికి పైగా ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఓవర్సీస్ స్కాలర్ షిప్​ నిధులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆరేళ్లలో నిధులు ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే పరిమితమైన ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఈబీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేద విద్యార్థులకు కూడా విస్తరించింది. పది లక్షల రూపాయల గరిష్ట పరిమితిని.. 20 లక్షల రూపాయలకు పెంచింది. ఓవర్సీస్ స్కాలర్ షిప్​లలో 10 శాతం హ్యూమనిటీస్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్​లతో పేద విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ, పీహెచ్​డీ కోర్సులు చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చూడండి :కేశవాపూర్​లో కరోనా కలకలం.. గ్రామస్థుల్లో ఆందోళన

ABOUT THE AUTHOR

...view details