పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. జూన్ 8 నుంచి పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ – కరోనా వైరస్ కట్టడి చర్యలపై దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా, జడ్ చోంగ్తులతో మంత్రి సమీక్షించారు.
రివైస్డ్ సిలబస్ మేరకు పరీక్షల నిర్వహణ...
కరోనా నియంత్రణ కోసం వాయిదా పడిన పరీక్షలు తిరిగి నిర్వహించనున్న సందర్భంగా రివైస్డ్ సిలబస్ మేరకు పరీక్షలు జరుగుతాయని మంత్రికి అధికారులు తెలిపారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని విద్యాలయాల్లోని 2,949 మంది విద్యార్థులకు 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోన్న నేపథ్యంలో పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. పరీక్షలకు వారం రోజుల ముందే విద్యార్థులు వసతి గృహాలకు చేరుకునేలా చూడాలన్నారు. వసతి గృహానికి వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారం రోజుల పాటు వారిని పరిశీలించాలన్నారు.