Gurukul School Job Recruitment: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి త్వరలోనే ఒకేసారి 11 వేలకు పైగా పోస్టులకు కలిపి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని గురుకుల నియామకబోర్డు నిర్ణయించింది. ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన దాదాపు 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తిచేసింది. సంక్షేమశాఖల వారీగా ప్రతిపాదనలు పరిశీలించిన బోర్డు, బీసీ గురుకులాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అదనపు పోస్టులకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం.
Job Recruitment in Gurukul Schools : ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రతిపాదనలు నియామక బోర్డుకు పంపించేలా బీసీ గురుకుల సొసైటీ ఇప్పటికే రోస్టర్, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తింపు పూర్తిచేసింది. ఈనెల రెండో వారంలో ప్రకటన జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది. సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే 9,096 పోస్టులను మంజూరు చేసింది. అదనపు పోస్టులతో కలిపి ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఇవి వెలువడిన తరువాత కనీసం మూడు నెలల సమయం ఉండేలా బోర్డు జాగ్రత్తలు పడుతోంది. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా షెడ్యూలు రూపొందించనుంది. ఉద్యోగ ప్రకటనలు ఒకేసారి ఇచ్చినప్పటికీ తొలుత పై నుంచి దిగువ స్థాయి పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల ఫలితాల్లోనూ తొలుత ఉన్నత స్థాయి పోస్టులకు వెలువరించి, ఆ పోస్టుల నియామకాలు పూర్తయిన తరువాత దిగువ స్థాయి పోస్టుల ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా గురుకులాల్లో ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి