గురుకులాల్లో పోస్టుల విభజన, సర్వీసు నిబంధనలకు సంబంధించిన దస్త్రంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల ఛైర్మన్ కొప్పుల ఈశ్వర్, సాధారణ గురుకుల సొసైటీ ఛైర్మన్ జగదీశ్‌రెడ్డి సంతకాలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రత్యక్ష నియామకాల్లో రాష్ట్రకేడర్‌ను తీసివేయగా, గురుకులాల్లో గతంలోని కేడర్‌ను అలాగే కొనసాగించాలని గురుకులాల బోర్డు నిర్ణయించింది. నూతన సర్వీసు నిబంధనల ప్రకారం కొత్త రోస్టర్‌కు అనుగుణంగా భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితాను అందజేయాలని సొసైటీలను ఆదేశించింది. గతంలో ప్రభుత్వ అనుమతి పొంది ప్రకటనలు వెలువరించని పోస్టులు 300 వరకు ఉండగా, ఇటీవల బీసీ గురుకులాల్లో ఆమోదించిన పోస్టులు 3600 వరకు ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం 4,000 వరకు పోస్టులు గురుకులాల్లో ఖాళీగా ఉన్నాయి.
మల్టీజోనల్ పరిధిలో పోస్టులు
- పూర్వ నిబంధనల ప్రకారం గురుకులాల్లో మల్టీజోనల్ పోస్టులు లేవు. తాజాగా సవరించిన సర్వీసు నిబంధనల ప్రకారం తొమ్మిది పోస్టులు ఈ కేటగిరీ కిందకు వచ్చాయి.
- పీజీటీ పోస్టును జోనల్ నుంచి మల్టీ జోనల్‌కు తీసుకువచ్చింది.
- మల్టీజోనల్‌గా మారిన వాటిలో డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, అధికారులు, పీజీటీ పోస్టులు ఉన్నాయి.
- గతంలో జిల్లా పోస్టులైన ఏఎన్‌ఎం, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ కేటగిరీలు జోనల్ కేటగిరీలోకి వచ్చాయి.
- డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకం, 30 శాతం పోస్టులను పదోన్నతుల కింద భర్తీ చేస్తారు.
- జూనియర్ కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల్లో 70 శాతం పదోన్నతులు, 30 శాతం ప్రత్యక్ష నియామకం కింద చేపట్టేలా బోర్డు ప్రతిపాదించింది.