గ్రానైట్ రాయిని కత్తిరించే రంపం ప్రమాదవశాత్తు కార్మికుడి శరీరంలోకి దూసుకుపోయింది. అతని పక్కటెముకల్లో నుంచి గుండె, ఊపిరితిత్తులను కోసుకుంటూ వెళ్లింది. దీంతో కార్మికుడికి తీవ్ర రక్తస్రావమైంది. అతడిని సహచర కార్మికులు గుంటూరు సర్వజనాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం కార్డియో థొరాసిక్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కళ్యాణి నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించారు. బ్లేడుకు చివరన రెండు అంగుళాల వెడల్పు కలిగిన మెటల్ స్క్రూ ఛాతీలో నుంచి ఊపిరితిత్తులను కోసుకుంటూ పోయింది.
గడ్డకట్టిన రక్తంలో అది ఇరుక్కుపోయినట్లు సీటీ స్కాన్‌లో బయటపడింది. తొలుత దాన్ని జాగ్రత్తగా బయటకు తీసి, తర్వాత దాదాపు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఈ గాయాన్ని స్టాబ్ ఇంజ్యురీ (గుండె పొరను పొడుచుకుంటూ వెళ్లడం) అంటారని డాక్టర్ కళ్యాణి వివరించారు. కార్మికుడికి లీటరున్నర రక్తం పోగా.. తిరిగి రెండున్నర లీటర్లు ఎక్కించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో ఇంటికి పంపనున్నారు.