గులాబ్ తుపాను ప్రభావంతో హైదరాబాద్(Gulab Effect on Hyd)లో భారీ వర్షం కురిసింది. పాతబస్తీలో కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. బహదూర్‌పురా నుంచి కిషన్‌బాగ్ వెళ్లే రహదారిలో వర్షపు నీటితో నాలా పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛత్రినాక, శివాజీనగర్, గంగానగర్ ప్రాంతంలోని వీధుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. చంద్రాయణగుట్ట నుంచి హష్మబాద్ వెళ్లే రహదారిపై భారీగా వర్షపు నీరు చేరుకోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాకత్‌పురా రైల్వే బ్రిడ్జి క్రింద వర్షపు నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరిపిలేని వర్షం...
ఎడతెరిపిలేని వర్షంతో మాదాపూర్ అమర్‌సొసైటీ నేక్టార్ గార్డెన్ కాలనీలోనికి వరద నీరు చేరింది. నాంపల్లి గాంధీ భవన్ పక్కనే ఉన్న సాయికృప అపార్ట్‌మెంట్‌లోకి మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖైరతాబాద్ రైల్వేట్రాక్‌పక్కన ప్రధాన రహదారిపై వరదనీరు వచ్చి చేరగా బల్దియా సిబ్బంది మోటర్ల సాయంతో నీటిని ఎత్తిపోశారు. భారీవర్షానికి గాజులరామారం పరిధి ఒక్షిత్ ఎంక్లేవ్ పూర్తిగా జలమయమైంది. కాలనీవాసులు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సికింద్రాబాద్‌లోని పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అల్వాల్‌లోని ఓ బేకరీ వద్ద రహదారిపై మోకాళ్లలోతు నీళ్లు నిలవటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోయిన్పల్లి, బేగంపేట, చిలకలగూడ, ఉప్పల్, రామాంతాపూర్, అంబర్ పేట, తార్నాక, నాచారంలో కురిసిన వర్షానికి రహాదారులు జలమయమయ్యాయి.
హాట్‌స్పాట్లపై దృష్టి..
భారీవర్షాలతో అప్రమత్తమైన జలమండలి హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి (Jalamandali Focus on Hotspots)పెట్టాలని ఆదేశించింది. నాలాలు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని... జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బందిని అప్రమత్తంచేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర (Cyberabad Cp Stphen Ravindra) తెలిపారు. జోన్లవారిగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో ముంపునకు గురైన, నీరు నిలిచే ప్రాంతాల వద్ద సహాయక చర్యలు చేపట్టేందుకు క్విక్ యాక్షన్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.