తెలంగాణ

telangana

ETV Bharat / state

కానుక సమర్పించక ముందే నిలువు దోపిడీ.. తిరుమలేశుడి భక్తులకు ధరల కాక - ttd room rent price

Room rents increased in Tirumala: ఆపదమొక్కులవాడి దర్శనంతో తమ బాధలన్నీ తొలగిపోతాయని... రోజూ వేల మంది భక్తులు అపార విశ్వాసంతో తిరుమలకు వెళ్తుంటారు. కొండపై వసతి సదుపాయం ఇన్నాళ్లూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల ధరలు అమాంతం పెంచడంతో "వెంకటేశా...కొండపై ఉండేదెలా..?" అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైపైచ్చు లడ్డూల ధరలు, కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సుల వెళ్లాలంటే ఛార్జీలూ మోతెక్కిస్తున్నాయి. మొత్తంగా తిరుమలేశుడి దర్శనానికి వెళ్లాలంటే .... సామాన్యుడు వెనుకాడే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారు.

room rents increased in tirumala
తిరుమలలో ధరల మోత

By

Published : Jan 12, 2023, 10:08 AM IST

తిరుమలలో ధరల మోత

Room rents increased in Tirumala:ఒక రోజుకు ఒక గదికి రూ.150 ఉన్న అద్దె ఇప్పుడు రూ.1700. ఇక పెద్ద గది అద్దె రూ.200 నుంచి రూ.2వేలకు పెరిగింది. లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ఏదైనా ప్రైవేటు హోటల్‌ యాజమాన్యం... ఇలా ధరలు ఇష్టానుసారం పెంచిందనుకుంటే పొరపాటే. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులపై వడ్డిస్తున్న ధరల వాతలివి. లాభాపేక్ష లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన తితిదే.. వాణిజ్య ధోరణిలో ఆలోచిస్తూ గదుల అద్దెలు పెంచడంపై భక్తులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం, తి.తి.దే. పాలకవర్గం భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై కాకుండా, వారి నుంచి డబ్బు పిండటంపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి. ఇప్పటికే లడ్డూ సహా ప్రసాదాల ధరలు పెంచి భక్తులపై భారం మోపిన తి.తి.దే... క్రమంగా కొండపై అతిథి గృహాల్లో గదుల ధరల్నీ ప్రైవేటు హోటళ్ల తరహాలో పెంచడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఆదాయమే పరమావధిగా.. :తి.తి.దే. ఒకానొక దశలో వివిధ ఆర్జిత సేవల ధరల్ని సైతం పెంచాలని ప్రయత్నించి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తి.తి.దే. పాలక మండలి సమావేశంలో అధికారులు ఒక ధర సూచిస్తే.. దాన్ని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మరిన్ని రెట్లు పెంచేస్తూ... వేలంపాట పాడినట్టుగా శ్రీవారి సేవల టికెట్‌ ధరల్ని పెంచాలనుకున్న తీరు అప్పట్లో టీవీ ఛానళ్లలో ప్రత్యక్షంగా ప్రసారమైంది. అది తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది. దాంతో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై తి.తి.దే. వెనక్కి తగ్గింది. ఆ తర్వాత తి.తి.దే. పాలక మండలి సమావేశాల్నీ ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. ఆ పరిణామంతో ఆర్జిత సేవల టికెట్ల పెంపు ప్రతిపాదనల్ని విరమించుకున్న తి.తి.దే... గదుల అద్దెలు పెంచడం, భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూల సంఖ్యను కుదించడం, ప్రసాదం ధరల పెంపు లాంటి చర్యలకు పాల్పడుతోంది. ఆర్జితసేవా టికెట్ల ధరలు ఎంత పెంచినా సామాన్యులకు ఇబ్బంది లేదు. అవి కొనేవారిలో ఆర్థిక స్తోమత, పలుకుబడి గలవారే ఎక్కువ. కానీ, గదుల అద్దెల పెంపు భారం సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతిపైనే ఎక్కువగా ఉంటుంది. 2022-23 సంవత్సరానికి తి.తి.దే. బడ్జెట్‌ 3,096.40 కోట్లు. అంత భారీ బడ్జెట్‌ ఉన్న తి.తి.దే... తలుచుకుంటే సామాన్య భక్తులపై భారం పడకుండా చూడలేదా? ఇలా అడ్డదిడ్డంగా పెంచడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

"చూశారా.. పేదల వినోదంపైనే అంత శ్రద్ధ కనబరిస్తే.. ప్రజలంతా కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే ఆ శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని మరింత సులువుగా, పెద్దగా ఆర్థిక భారం లేకుండా సామాన్యులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?"

- సినిమా టికెట్ల ధరల్ని తగ్గించడాన్ని సమర్థించుకుంటూ ముఖ్యమంత్రి జగన్‌ గతేడాది జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చెప్పిన మాటలివి.

1133% పెరిగిన ధరలు : తిరుమల కొండపై సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఎస్వీ, నారాయణగిరి అతిథి గృహాల్లో గదుల అద్దెలను ఒక్కసారిగా 150 నుంచి 17 వందలకి పెంచడం ప్రజలపై పెనుభారం కాదా? ఒక్కసారిగా ధరల్ని 1133% పెంచడం ఎలా సమర్థనీయం? తిరుమలలోని అతిథి గృహాలు, కాటేజీల్లో వివిధ కేటగిరీల గదులు సుమారు 7,200 ఉన్నాయి. వాటిలో ఒక గదికి ఒకరోజు అద్దె రూ.50 మాత్రమే. ఇక రాంబగీచా, వరాహస్వామి గెస్ట్‌హౌస్, ఎస్ఎన్ జీహెచ్, హెచ్ వీడీసీ, ఏటీసీ, టీబీసీల్లో రూ.100, నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌హౌస్‌లలో రూ.150, విష్ణుపాదంలో రూ.250, వకుళమాత, కౌస్తుభం, పాంచజన్యం, నందకం అతిథి గృహాల్లో రూ.500 చొప్పున ఉండేవి. ఇటీవల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత అతిథి గృహాల ధరల్ని వెయ్యికి పెంచేశారు. ఎస్వీ అతిథి గృహంలో 31 గదులుండగా, వాటి అద్దెను రూ.150 నుంచి రూ.1700 చేశారు. ఇప్పుడు నాలుగు నారాయణగిరి అతిథి గృహాల్లోని 164 గదుల అద్దెలనూ పెంచేశారు.

కోటాలో కోత, ధరల మోత :శ్రీవారికే కాదు... భక్తులకూ తిరుమలకొండపై ప్రసాదంగా ఇచ్చే లడ్డూ అత్యంత ప్రీతిపాత్రం. వైకాపా అధికారంలోకి వచ్చాక లడ్డూ ధరల్ని అమాంతం పెంచేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది. గతంలో రూ.25 ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచారు. రూ.25ఉన్న వడ ధరను నాలుగు రెట్లు పెంచేసి రూ.100 చేశారు. . కల్యాణం లడ్డూధరను రూ.100 నుంచి రూ.200కి పెంచారు. . ఇదివరకు కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ‘దివ్యదర్శనం’ సౌకర్యం ఉండేది. రోజుకు 20వేల మందికి టోకెన్లు ఇచ్చేవారు. వారికి ఉచితంగా ఒక లడ్డూ, దానికి అదనంగా రెండు లడ్డూలు రూ.10 రూపాయల చొప్పున, మరో రెండు లడ్డూలు రూ.25 చొప్పున అందజేసేవారు. దాంతో కాలినడకన వెళ్లే భక్తులకు ఉచిత లడ్డూతోపాటు, రూ.70 వెచ్చిస్తే మరో నాలుగు లడ్డూలు లభించేవి. ఇప్పుడు ఏకంగా దివ్యదర్శనాన్నే ఎత్తేశారు. బ్రేక్, సుపథం దర్శనాలకు వెళ్లినవారికి ఇది వరకు 2 లడ్డూలు ఇస్తే.. ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు.

రవాణా చార్జీలూ భారమే.. :వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ టికెట్‌ ఛార్జీలను మూడుసార్లు పెంచడం తిరుమల వెళ్లే భక్తులకు భారంగా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో టికెట్‌ ధర రూ.75 ఉండేది. దాన్ని డీజిల్‌ సెస్‌ పేరుతో ఒకసారి రూ.85కి, ఆ తర్వాత మళ్లీ రూ.90కి పెంచారు. రెండు వైపుల టికెట్‌ ఒకేసారి తీసుకుంటే రూ.160 రూపాయలకి ఇస్తున్నారు. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం గుడివాడ నుంచి బస్సులో తిరుమల వెళ్లి, నారాయణగిరి అతిథి గృహంలో రెండు రోజులు బసచేసి శ్రీవారిని దర్శించుకుని రావాలంటే కనీస వ్యయం 17వేలు అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details