GST collections : దేశంలో జీఎస్టీ ప్రవేశ పెట్టిన తర్వాత ఐదోసారి కూడా జీఎస్టీ రాబడి లక్షా 30వేల కోట్ల మార్క్ దాటింది. గతేడాది ఇదే నెల రాబడులతో పోల్చితే 18శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలోనూ లక్షా 30వేలు కోట్లకుపైగా రాబడి వచ్చింది. వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ అదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఈ జనవరిలో రూ.లక్షా 38వేల 394 కోట్లు రాగా.. ఫిబ్రవరిలో లక్షా 33వేల 26 కోట్లు రాబడులు వచ్చినట్లు కేంద్ర ఆర్థక శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో వచ్చిన జీఎస్టీ రాబడుల్లో కేంద్ర జీఎస్టీ కింద రూ.24,434 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద రూ.30,779 కోట్లు, సమీకృత జీఎస్టీ కింద రూ.67,471 కోట్లు, సెస్ కింద రూ.10,340 కోట్లు రాబడులు వచ్చినట్లు తెలిపింది.
18శాతం వృద్ధి
ఎగవేతదారులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు రిటర్న్‌లు దాఖలు చేయడంలో మార్పులు చేయడంతో నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఐటీసీ తీసుకునేందుకు అవకాశాలను నిలువరించింది. ఇకపై నెల నెల వచ్చే జీఎస్టీ వసూళ్లూ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సమీకృత జీఎస్టీ రూ.67,471 కోట్లు మొత్తాన్ని రాష్ట్రాలకు సర్దుబాటు చేయగా... కేంద్ర జీఎస్టీ కింద రూ.26,347 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద రూ.21,909 కోట్లు వచ్చినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 2020 ఫిబ్రవరిలో వచ్చిన జీఎస్టీ రాబడులపై 2021 ఫిబ్రవరిలో 26శాతం వృద్ధి నమోదు చేయగా... ఇప్పుడు ఆ మొత్తంపై 18శాతం వృద్ధి కనబరిచింది.