తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో పెరిగిన వాణిజ్య పన్నుల రాబడి - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి అనూహ్యంగా పెరిగింది. జనవరిలో జీఎస్టీ ఆదాయం 22 శాతం పెరుగుదల నమోదైంది. మద్యం రాబడి సైతం 18 శాతం లెక్కన వృద్ధి సాధించింది. ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని జమ చేసే వాణిజ్య పన్నుల శాఖ రాబడిలో గతేడాది కంటే 6.6 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం కంటే 2,526 కోట్లు ఆదాయం వచ్చినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

gst-profits-increasing-in-january-month-in-telangana
రాష్ట్రంలో పెరిగిన వాణిజ్య పన్నుల రాబడి

By

Published : Feb 11, 2021, 11:38 AM IST

రాష్ట్రంలో పన్నుల రాబడిలో ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు అవుతోంది. జనవరి మాసంలో వ్యాట్‌తోపాటు, జీఎస్టీ రాబడులు భారీగా పెరిగాయి. కొవిడ్, లాక్‌డౌన్‌ ప్రభావాల నుంచి బయటపడి.. పన్నుల వసూళ్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి వసూళ్లలో క్రమంగా పెరుగుదల కనిపిస్తుండగా... జనవరిలో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గత ఏడాది ఏప్రిల్‌లో రూ.932.54 కోట్ల ఆదాయం రాగా.. మే నెలలో రూ.1567.21 కోట్లు.. జూన్‌ నెలలో రూ.3,776.67 కోట్లు వచ్చింది. జులై నెలలో రూ.3,786.21 కోట్లు.. ఆగస్టు నెలలో రూ.3,935.50 కోట్ల లెక్కన ఆదాయం వచ్చింది. 2020 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు పన్నుల వసూళ్లు క్రమంగా పెరిగినప్పటికీ 2019లో ఇదే సమయంలో వచ్చిన రాబడులతో పోల్చితే రూ.5,059.87 కోట్ల మేర తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కొవిడ్‌ కారణంగా 2020-21ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలు రాబడి నామమాత్రంగా ఉన్నా... ఆ తర్వాత పుంజుకుంది. గత ఏడాది సెప్టెంబరులో 3,890.31 కోట్లు రాబడి రావటంతో.... అంతకుముందు ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే.. 18 శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. అక్టోబరు నెలలో వచ్చిన రూ.4,957.49 కోట్ల ఆదాయం... గతేడాదితో పోల్చేతే 58 శాతం వృద్ధి కనబర్చింది. నవంబరులో వచ్చిన 6,876.51 కోట్ల రాబడి... ఏకంగా 77 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్‌లో రూ.5, 812.11 కోట్లు వసూలు అయ్యి.. అంతకుముందు ఏడాది కంటే 27.31శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో రూ.5, 223.29 కోట్ల ఆదాయం... 2020 జనవరి కంటే 22 శాతం వృద్ధి నమోదు చేసింది.

ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు పది నెలల్లో వసూళ్లు అయిన వ్యాట్‌, జీఎస్టీల రాబడి మొత్తం రూ.40,757.84 కోట్లు నమోదైంది. అంతకుముందు ఇదే ఆర్థిక ఏడాదిలో వచ్చిన రాబడులు కంటే.. ఇది 6.61 శాతం ఎక్కువని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో.. పెట్రోల్‌ అమ్మకాలు ద్వారా 6,736.67 కోట్లు, మద్యం విక్రయాలపై వ్యాట్‌ రాబడులు రూ.9,405 కోట్లు రాగా... మిగిలిన మొత్తం వస్తు సేవల పన్నుగా తెలిపారు. ఈ పది నెలల్లో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి 3,669 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:వీరుడా వందనం.. స్వర్ణోత్సవ సంబురం

ABOUT THE AUTHOR

...view details