New GST Rules: నిత్యావసరాలపై జీఎస్టీ భారం ఇప్పుడిప్పుడే ప్రజల అనుభవంలోకి వస్తోంది. ఈ నెల 18 నుంచి ఆహార పదార్థాలపై జీఎస్టీ అమల్లోకి రాగా బిల్లులు చూసి జనం బెంబేలెత్తుతున్నారు. పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ సహా ఆహారపదార్థాలు, నిత్యావసరాలన్నీ పన్ను పరిధిలోకి వచ్చేశాయి. కూరగాయలు మినహా అన్ని ప్యాకెట్లలో ఉండే బ్రాండెడ్ పదార్థాలపై 5 నుంచి 18 శాతం దాకా జీఎస్టీ భారం పడిన విషయం విదితమే. కిలో విజయ పెరుగుపై ధర రూ.ఆరు పెరిగింది.
ప్యాక్డ్ పప్పులు సగటున కిలో వందకు పైగా ఉండగా ప్రతి దానిపై కనీసం రూ.5 పెరిగింది. ప్రతికుటుంబంపై సగటున రూ.500 దాకా భారం పడింది. ఇప్పటికే బ్రష్‌పై 5 శాతం, పేస్ట్‌పై 18 శాతం.. సోప్‌పై 12 శాతం.. షాంపూపై 18 శాతం, పౌడర్‌పై 18శాతం, ముఖానికి పూసుకునే క్రీమ్‌పై 28 శాతం జీఎస్టీ చెల్లిస్తున్న మధ్యతరగతికి ఇది అదనపు మోతే. కాఫీ లేదా టీ తాగుదామంటే 5 శాతం, చక్కెరపై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. చివరకు షేవింగ్ బ్లేడ్, కూరగాయలు కోసే కత్తి, అన్నం తినే స్పూన్‌లు కూడా జీఎస్టీ నుంచి తప్పించుకోలేకపోయాయి. ఉదయం లేచింది మొదలు పడుకునే దాకా వినియోగించే లేదా తినే ప్రతి వస్తువు, పదార్థంపైనా కూడా 5 శాతం నుంచి 28 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఈ ధరలతో ఏం తినేటట్లు లేదని బడుగు జీవి ఆవేదన చెందుతున్నారు.
హోటళ్లలోనూ పెంచేస్తున్నారు
కొత్త జీఎస్టీ హోటళ్లలో పదార్థాల రేట్లనూ ప్రభావితం చేసింది. 5-10శాతం దాకా ధరల పెరుగుదల తప్పదని హోటల్ యజమానులు చెబుతున్నారు. ప్లేటు రూ.40 ఉన్న టిఫిన్ ధ]రను రూ.5-10 వరకు పెంచాల్సి వస్తుందంటున్నారు. ఎస్సార్‌నగర్‌లో ఓ హోటల్ నిర్వాహకుడు మాట్లాడుతూ పాల ఉత్పత్తులతో తయారయ్యే వాటితో పాటు ఇతర ఆహారపదార్థాలపైనా జీఎస్టీ విధించడంతో ధరలు పెరుగుతున్నాయన్నారు. బ్రాండెడ్ పదార్థాలనే వినియోగిస్తామని.. ఒక్క కూరగాయలు తప్ప దాదాపు ప్రతిదానిపై ఐదు శాతం జీఎస్టీ భారం కచ్చితంగా పడుతుందన్నారు. బియ్యం కూడా 25 కిలోల ప్యాకెట్‌లలోనే ఉంటున్నాయని, ఆటా ఐదు లేదా పది కిలోల ప్యాకెట్‌లలో లభ్యమవుతుందని, ఇతర పప్పులు కూడా చాలా వరకు కిలో ప్యాకెట్‌లే ఉంటాయని దీంతో ధరలు పెంచేస్తారన్నారు. ఈ భారం వినియోగదారుల నుంచే వసూలు చేయాల్సి ఉంటుందని వారం పదిరోజుల్లో జీఎస్టీ ప్రభావం స్పష్టంగా తెలుస్తుందన్నారు. నిత్యావసర సరకుల ధరలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలతో ఇప్పటికే పలుమార్లు రేటు పెంచాల్సి వచ్చిందన్నారు.
ఏం కొనేటట్లు లేదు.. రూ.550 అదనంగా చెల్లించా..
కూకట్‌పల్లిలోని ప్రముఖ సూపర్‌మార్కెట్ వద్ద నెలవారీ సరకుల కొనుగోలుకు వచ్చిన గృహిణి మాట్లాడుతూ ధరలు నెలా నెలా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం అరకేజీ పెరుగు కొంటే గతంలో చెల్లించే దానికంటే అదనంగా మూడు రూపాయలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. బియ్యంపై జీఎస్టీతో అదనంగా రూ.60 వెచ్చించినట్లు తెలిపారు. తాము సరకులను కిలో ప్యాకెట్‌లో కొంటామని గత నెల కంటే ఈ నెల బిల్లు రూ.550 పెరిగిందన్నారు. గ్యాస్‌ధర పెరగడం, ప్రయాణ ఛార్జీలతో పాటు కనీసం వంట వండుకునే ఆహారపదార్థాలనూ మినహాయించకపోవడంతో తమ లాంటి మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదన్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం..