తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్‌తో పోలిస్తే జూన్‌లో ఆశాజనకంగా జీఎస్టీ రాబడులు - Gst Collections news

తెలంగాణ రాష్ట్రంలో వస్తు సేవల పన్ను రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. కొవిడ్‌ ప్రభావంతో ఏప్రిల్‌ నెలలో కేవలం 20శాతమే ఆదాయం వచ్చినా... జులై నాటికి 80శాతం వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూలీల కొరతతో నిర్మాణ రంగం మందకొడిగా సాగుతుండగా... ఎలక్ట్రానిక్‌ పరికరాల విక్రయాలు అనూహ్యంగా పెరగడం వల్ల జీఎస్టీ రాబడులు ఆశించినదానికంటే ఎక్కువ వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Gst Collections Increased in telangana
ఏప్రిల్‌తో పోలిస్తే జూన్‌లో జీఎస్టీ రాబడులు ఆశాజనకం

By

Published : Aug 25, 2020, 6:46 AM IST

రాష్ట్ర రాబడిలో కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడులు ఆశాజనకంగా మారాయి. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఏప్రిల్‌లో దారుణంగా పడిపోయిన రాబడులు జూన్‌ నాటికి గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్‌లో రాష్ట్రం నుంచి జీఎస్టీ రాబడులు కేవలం రూ.926 కోట్లు కాగా.. జూన్‌ నాటికి రూ.3274 కోట్లకు పెరిగాయి. కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, సెస్సు.. అన్నీ పెరిగాయి. జులైలోనూ జూన్‌లో వచ్చినన్ని రాబడులు ఉంటాయని తెలుస్తోంది. జీఎస్టీ రాబడుల్లో అత్యధికంగా వచ్చేది సిమెంటు, స్టీలు రంగం నుంచి. కరోనా నేపథ్యంలో వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మొదట్లో ఉన్నంత ప్రభావం ప్రస్తుతం లేకున్నా కార్మికుల కొరత కొనసాగుతోంది. సిమెంటు, స్టీలు విక్రయాలపై ఆ ప్రభావం పడుతోంది. అయితే ఎలక్ట్రానిక్‌ వస్తువుల విక్రయాలు క్రమంగా పుంజుకోవడం జీఎస్టీ రాబడుల పెరుగుదలకు దోహదం చేస్తోంది.

జీరో వ్యాపారంతో గండి

రాష్ట్రంలో జీఎస్టీ రాబడులకు జీరో వ్యాపారం గండి కొడుతోందని వాణిజ్య పన్నులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లలేకపోవడం పన్ను ఎగవేతదారులకు అవకాశంగా మారిందని పేర్కొంటున్నారు. స్టీలులో జీరో వ్యాపారం బాగా పెరిగినట్లు అధికారుల అంతర్గత పరిశీలనలో వెల్లడైంది. పన్ను ఎగవేతను నిలువరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడంలేదు.

సెస్సుపై తీవ్ర ప్రభావం

కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), సెస్సులు కేంద్ర ఖజానాకు చేరే రాబడులు కాగా.. రాష్ట్ర జీఎస్టీ, ఐజీఎస్టీ రాష్ట్ర ఖజానాకు చేరుతాయి. సెస్సు రాబడులపై లాక్‌డౌన్‌ ప్రభావం గణనీయంగా పడింది. సగటున నెలకు రూ.500 కోట్ల రావాల్సి ఉండగా ఏప్రిల్‌లో రూ. 142 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. జూన్‌ నాటికి ఇది రూ.489 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే రాబడులు తక్కువగా ఉన్నా కరోనా నేపథ్యంలో పరిస్థితి ఆశాజనకమేనని కేంద్ర జీఎస్టీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details