Gruha lakshmi Scheme Last Date Today : ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేరేందుకు.. గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. దీనికోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణకు నేడు తుది గడువు కావడంతో మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని.. గడువు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
Gruha lakshmi Scheme Telangana : నారాయణపేట జిల్లాలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం జనాలతో కిక్కిరిసిపోయింది. దాంతో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయానికి గృహలక్ష్మి పథకం(Gruhalakshmi Scheme) కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు. అవసరమైన పత్రాలు అందకపోతే లబ్ధి పొందలేమని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. గడువు పెంచే విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. మరోవైపు కరీంనగర్ నగరపాలక సంస్థలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Gruhalakshmi Scheme Application :నిబంధనల ప్రకారం గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 20వ తేదీలోగా దరఖాస్తుదారుల వెరిఫికేషన్ పూర్తి చేసి 25న తొలి దశ లబ్దిదారులను(Gruhalakshmi Scheme Beneficiaries) ఎంపిక చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియఅని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న ఆయన.. పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని పేర్కొన్నారు.