Group-4 Recruitment in Telangana: రాష్ట్రంలో 80వేల 39 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వాటిలో గ్రూప్-1 సహా వివిధ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉండగా, మరికొన్ని పోస్టులకు సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. మొత్తం 80 వేలకుపైగా ఉద్యోగాలకుగాను ఆర్థికశాఖ ఇప్పటివరకు 52 వేలకుపైగా పోస్టుల భర్తీకి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఆయా ఉద్యోగాల భర్తీని నియామక సంస్థలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అందుకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగ నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. కీలకమైన గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రారంభించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయింది. ప్రాథమిక కీ, అభ్యంతరాల స్వీకరణ, అనంతరం తుది కీ ప్రకటన అయిపోయింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించాల్సి ఉంది.
ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహించాలన్న ఆలోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదట ఉండేది. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన అంశాలు దృష్టిలో ఉంచుకొని మెయిన్స్ తేదీని ఖరారు చేయనున్నారు. గ్రూప్-2, 3 పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా టీఎస్పీఎస్సీప్రారంభించాల్సి ఉంది. 663 గ్రూప్-2, 1373 గ్రూప్-3 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు.