783 పోస్టులతో గ్రూప్-2.. త్వరలో మరో 4 ప్రకటనలు.. - 783పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
గ్రూప్2
By
Published : Dec 29, 2022, 7:01 PM IST
|
Updated : Dec 30, 2022, 6:53 AM IST
18:57 December 29
గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో గ్రూప్-1 తరువాత నిరుద్యోగులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 ఉద్యోగ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ గురువారం జారీ చేసింది. దీని కింద మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.
గ్రూప్-2లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగంలో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు (ఏఎస్‌వో) 165, మండల పంచాయతీ అధికారులవి 126, నాయబ్ తహసీల్దారువి 98, ప్రొబేషనరీ ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు 97 ఉన్నాయి.
మరిన్ని విభాగాల చేరికతో పెరిగిన పోస్టులు..గ్రూప్-2 కింద 663 పోస్టులను గుర్తిస్తూ 2022 ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీ చేసింది. తర్వాత వీటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో ఈ స్థాయి కలిగిన మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. అప్పటివరకు గ్రూప్-2 పరిధిలోని 16 రకాల సర్వీసులకు సంబంధించి ఉన్న 663 ఉద్యోగాలకు కొత్తగా మరో ఆరు కేటగిరీలకు చెందిన 120 పోస్టులు చేరాయి. అదనంగా చేరిన పోస్టుల్లో సహాయ సెక్షన్ అధికారి(రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవలు), సహాయ సెక్షన్ అధికారి (ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు (జువైనల్ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టులు ఉన్నాయి. దీంతో మొత్తం గ్రూప్-2 పోస్టులు 783కి చేరాయి. అదనంగా చేర్చిన పోస్టులకు గతంలో వేరుగా పరీక్షలు జరిగేవి. అయితే గ్రూప్-2, తత్సమాన హోదా కలిగిన పోస్టులన్నీ కలిపి భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించడంతో అన్నింటికీ కలిపి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
త్వరలో మరో 4 ప్రకటనలు...గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడటంతో త్వరలోనే మరో నాలుగు ప్రకటనలు వెలువరిచేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. గ్రూప్-3 పోస్టులకు ప్రకటన జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. అటవీ బీట్ అధికారి, డిగ్రీ లెక్చరర్, సహాయ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు ప్రకటనలు జారీ చేయనుంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి నిరుద్యోగులు సన్నద్ధమయ్యేలా వెసులుబాటు కల్పించనుంది.
సన్నద్ధమయ్యేందుకు సమయం ఇస్తాం...గ్రూప్-2 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన సమయం ఇస్తామని పేర్కొన్నారు. ఇతర పరీక్ష తేదీలకు ఆటంకం లేకుండా చూస్తామని, ఉద్యోగార్థులు సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని గ్రూప్-2 ఉద్యోగాలకు పోటీపడాలని సూచించారు. -- టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి