Group-1 Prelims Arrangements In Telangana : రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు.
CS Review On Group-1 Exam Arrangements : గ్రూప్-1 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు.ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షను రద్దుచేసిన కమిషన్ ఆదివారం పునః పరీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 2.75 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎమ్ఆర్పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలని, దాని ప్రకారమే కీ ఆధారంగా వాల్యుయేషన్ జరుగుతుందని పేర్కొన్నాయి.