రాష్ట్రంలోని 29జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం పెరిగిందని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ సంచాలకులు పండిట్ మద్నూరే నివేదిక విడుదల చేశారు. 12నెలల కిందటితో పోలిస్తే భూగర్భ జలమట్టం 2020 డిసెంబరులో సగటున 2.46మీటర్ల మేర పెరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబరు నెలలో రాష్ట్ర సగటు మట్టం 8.12 మీటర్లు ఉండగా, 2020 డిసెంబరు నెల సగటు మట్టం 5.66 మీటర్లుగా నమోదయింది.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, తుపాన్లు రావడం, నదులు, వాగులు, చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో జలమట్టంతో పెరుగుదల నమోదైంది. 2020 నవంబరు నెలతో, డిసెంబరు మట్టాలను పోల్చగా రాష్ట్రంలో 43 చదరపు కిలోమీటర్ల భూభాగంలో మాత్రమే 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీళ్లున్నట్లు గుర్తించారు. 15-20 మీటర్ల లోతులో జలం ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ పశ్చిమప్రాంతం, సంగారెడ్డి పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు, మెదక్ దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు, సిద్దిపేట పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం దక్షిణ, తూర్పు ప్రాంతాలు, జోగులాంబ గద్వాల జిల్లా తూర్పు, పశ్చిమ ప్రాంతాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలున్నాయి’ అని ఆయన వెల్లడించారు.