సామాజిక సేవ చేయడంలోనే మనిషికి సంపూర్ణ ఆనందం లభిస్తుందని తెరాస ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు అన్నారు. సేవా భారత్, వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీఏలో 300 మంది పేదలకు, జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... లాక్డౌన్ సమయంలో ఎంతో మంది మానవతావాదులు పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారని కొనియాడారు. ఇలాంటి వాటిలో సేవా భారత్, గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏలు ముందున్నాయన్నారు.
లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు నెలకు సరిపడే బియ్యంతో పాటు 12 రకాల వస్తువులను అందించామని సేవా భారత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా తాము సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. పాతబస్తీలో 10 వేల ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామని చెప్పారు. 40 ఏళ్ల నుంచి తమ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.