తెలంగాణ

telangana

ETV Bharat / state

GRMB MEETING: నేడు జీఆర్​ఎంబీ సమావేశం.. ఆ ప్రాజెక్ట్​ నిర్వహణపైనే కీలక చర్చ

గెజిట్ నోటిఫికేషన్ అమలుపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. ఈనెల 14వ తేదీ నుంచి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణ విషయమై భేటీలో చర్చించనున్నారు. నిన్న అసంపూర్తిగా జరిగిన కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం ఇవాళ కూడా కొనసాగనుంది.

GRMB meeting is going on today
నేడు జీఆర్​ఎంబీ సమావేశం

By

Published : Oct 11, 2021, 4:58 AM IST

గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సభ్యులు పాల్గొంటారు. ఈ నెల 14వ తేదీ నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై సమావేశంలో చర్చిస్తారు. గోదావరిపై ఉన్న పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకునే విషయమై నిన్న జరిగిన ఉపసంఘం సమావేశంలో చర్చించారు. పెద్దవాగు ఆయకట్టు ఏపీలో 85 శాతం, తెలంగాణలో 15 శాతం ఉన్నందున అందుకు అనుగుణంగా నిర్వహణ వ్యయాన్ని భరించాలని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఆ అంశాల ఆధారంగా ఇవాళ గోదావరి బోర్డు పూర్తి స్థాయి సమావేశం జరగనుంది.

కేఆర్​ఎంబీ ఉపసంఘం మరోసారి సమావేశం

ప్రాజెక్టు సంబంధిత అంశాలు, బోర్డుకు రెండు రాష్ట్రాల నుంచి నిధుల విషయమై భేటీలో చర్చిస్తారు. అటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇవాళ మరోమారు సమావేశం కానుంది. కేఆర్ఎంబీ సభ్యుడు ఆర్కే పిళ్లై అధ్యక్షతన నిన్న సబ్ కమిటీ భేటీ అయ్యింది. చాలా అంశాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. నోటిఫికేషన్​లోని రెండో షెడ్యూల్​లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, కేంద్రాల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాల అధికారులకు పిళ్లై స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి శ్రీశైలం, సాగర్ జలవిద్యుత్ కేంద్రాల సమాచారం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎండీ దృష్టికి ఈ విషయాన్ని మరోమారు తీసుకెళ్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం. నోటిఫికేషన్ లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం ఇవాళ మధ్యాహ్నం లోగా ఇవ్వాలని పిళ్లై అధికారులకు స్పష్టం చేశారు. వాటి ఆధారంగా రేపు జరగనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తారు.

సంబంధిత కథనం:KRMB, GRMB: ప్రాజెక్టుల స్వాధీనం సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాలు అంగీకరించేనా?

ABOUT THE AUTHOR

...view details