డ్రోన్ల (Drone)ను వేటాడటం ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వేల రూపాయల డ్రోన్‌ను కూల్చేందుకు లక్షలు లేదా కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వాడాల్సి ఉంటుంది. గస్తీ దళంలోని ఒక అమెరికా సైనికుడి వద్ద రూ.13 లక్షల విలువైన పరికరాలు ఉంటాయి. అదే ధరకు దాదాపు డజన్‌కు పైగా క్వాడ్‌కాప్టర్ డ్రోన్లు లభిస్తాయి. అంటే డ్రోన్లు ఎంత చౌకో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వాటిని వేటాడకపోతే.. అవి మోసుకొచ్చే కిలోల కొద్ది పేలుడు పదార్ధాలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి.
ఖర్చుతో కూడుకున్నవి...
మానవ రహిత విమానాలను కూల్చే యాంటీ యూఏవీ వ్యవస్థలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. కీలక కార్యాలయాలు, భవనాలు, పరిమిత ప్రదేశాల రక్షణకు ఉపయోగించే ‘పాయింట్ డిఫెన్స్’ వ్యవస్థలుగా మాత్రమే పనికి వస్తాయి. ఒక్క పశ్చిమ సరిహద్దు రక్షణకే ఇలాంటివి 300 వ్యవస్థలు అవసరమవుతాయి. ఆర్థికంగా ఇది ఏమాత్రం ప్రయోజనకరం కాదు.
స్వార్మ్(దండు) టెక్నాలజీ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వాయుసేనకు చెందిన అవాక్స్‌లు, ఎయిర్ రీఫ్యూయలర్ ట్యాంకర్లు, గగనతల రక్షణ వ్యవస్థల వంటి అత్యంత ఖరీదైన ఆయుధాలను ధ్వంసం చేయడానికి వీటిని వాడతారు. కృత్రిమ మేధ, డీప్‌లెర్నింగ్ టెక్నిక్స్ ఆధారంగా దండులోని డ్రోన్లు పరస్పరం సమాచార మార్పిడి చేసుకొంటూ లక్ష్యాలను గుర్తించి.. అవసరమైతే దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఈ లెక్కలు చూస్తే ఎంత డేంజరో తెలుస్తుంది..
ఇటీవల ఆర్మేనియా-అజర్ బైజన్ యుద్ధం భారత్‌కు కనువిప్పు కలిగించాలి. ఆర్మేనియా సేనలు సంప్రదాయ ఆయుధాలతో రంగంలోకి దిగితే.. అజర్ బైజన్ సేనలు కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉంటూ విజయం సాధించాయి. వాషింగ్టన్ పోస్టు కథనం ప్రకారం ఈ యుద్ధంలో ఆర్మేనియా 185 టీ-72 ట్యాంకులు, 182 శతఘ్నులు, 90 సాయుధ వాహనాలు, 73 మల్టిపుల్ రాకెట్ లాంఛర్లు, ఐదు ఎస్-300 వ్యవస్థలు, 26 రాకెట్ ప్రయోగ వ్యవస్థలు, 14 రాడార్, జామర్లను కోల్పోయింది.
వీటిలో అత్యధికం అజర్ బైజాన్ డ్రోన్లకు బలైనవే. ఇక అజర్ బైజన్ 22 ట్యాంక్‌లు, 41 సాయుధ వాహనాలు, ఒక హెలికాప్టర్, 25 డ్రోన్లను కోల్పోయింది. 1990ల నాటి యుద్ధంలో లభించిన సంప్రదాయ ఆయుధ ఆధిపత్యాన్నే ఇంకా నమ్ముకున్నందుకు ఆర్మేనియా చెల్లించిన మూల్యం ఇది.
విదేశాలకు మన వ్యూహాలు తెలుస్తాయి..
సాధారణంగా మనం విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే.. మన అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకొనే క్రమంలో సైనిక వ్యూహాలను ఆ దేశాలతో పంచుకోవాల్సి వస్తుంది. అంతే కాదు.. కీలకమైన సాఫ్ట్‌వేర్లు, కోడ్లు వారు భారత్‌కు ఇవ్వరు. దీంతో ఎంత డబ్బు ఖర్చుపెట్టి కొనుగోలు చేసినా.. ఆ వ్యవస్థలు బలహీనంగానే ఉంటాయి.
మన ‘ఇంద్రజాల్’ పనిచేసేది ఇలా..
చిన్న డ్రోన్లను గుర్తించడం చాలా కష్టం. వాటిని గుర్తిస్తే కూల్చేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ రొబోటిక్స్ అనే స్టార్టప్ ‘ఇంద్రాజాల్’ (Indrajaal) పేరుతో ఒక యాంటీడ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ఒక్క వ్యవస్థ అత్యధికంగా 2,000 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ వ్యవస్థను మొత్తం ఒకే చోట ఏర్పాటు చేయరు. వేర్వేరు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన సెన్సర్లు, రాడార్లు అమరుస్తారు. దీంతో పశ్చిమ సరిహద్దు రక్షణకు అత్యధికంగా 7 వ్యవస్థలు సరిపోతాయి. సెన్సర్లను బట్టి రక్షణ ఛత్రంలో పలు పొరలు ఉంటాయి. ఇవి పూర్తిగా కృత్రిమ మేధపైనే ఆధారపడి పనిచేస్తాయి. దీంతో 24x7x365 నిఘా వ్యవస్థ సచేతనంగా ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, కృత్రిమ మేధలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలను కలిపి దీనిని తయారు చేశారు. ఇది లక్ష్యాన్ని గుర్తించడం, విశ్లేషించడం, డీకోడింగ్, స్వతంత్రంగా దాడి చేయగలదు. మానవ రహిత విమానాలు, తక్కువ రాడార్ సిగ్నేచర్ ఉన్న డ్రోన్లు, గాల్లో సంచరిస్తూ లక్ష్యాలపై దాడి చేసే ‘లాయిటరింగ్ మ్యూనిషన్’లను కూల్చగలదు.
ఇప్పటికే భారత్ వినియోగిస్తున్న ఆయుధ, రక్షణ వ్యవస్థలకు దీనిని అనుసంధానించే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ ప్రత్యేకమైన రాడార్లు, సెన్సర్లు డ్రోన్‌ను గుర్తించగానే దాని సైజును అంచనా వేసి దళాల ఆయుధ వ్యవస్థకు సంకేతాలు పంపిస్తాయి. అవి వెంటనే దాడి చేసి డ్రోన్‌ను కూల్చేస్తాయి.
అనుభవజ్ఞుల బృందం..
గ్రీన్ రోబోటిక్స్ స్టార్టప్ అడ్వైజరీ బోర్డులో యుద్ధరంగంలో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. సంస్థ సీఈవో సాయి కూడా వింగ్ కమాండర్‌గా పనిచేశారు. అంతేకాదు విశ్రాంత డిఫెన్స్ సైంటిఫిక్ అడ్వైజర్, డిప్యూటీ ఆర్మీచీఫ్ బీఈఎల్ డైరెక్టర్, వాయుసేనలో పనిచేసిన వారు ఉన్నారు. ఈ కంపెనీ కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, కాగ్నెటివ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పనిచేస్తోంది. ఇప్పటికే కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సాయుధ వాహనాలను సిద్ధం చేస్తోంది.
ఇదీ చూడండి:Toss: అందరూ ఉత్తీర్ణులే... ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు