హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో శాసనసభ ఎన్నికల కంటే పోలింగ్ భారీగా పెరుగుతుందని అంతా భావించారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా ఓటర్లు స్పందించారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో 60 నుంచి 70 శాతం వరకు ఓటింగ్ నమోదవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం 50 శాతానికి మించడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం, బల్దియా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాయి. అయినా ఫలితం కనిపించలేదు. పోలింగ్ శాతం కాస్త మాత్రమే పెరిగింది.
జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం అంతగా పెరగకపోవడానికి కారణాలూ కనిపిస్తున్నాయి. అందులో కరోనా ప్రభావం ఒకటి. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని... పెద్దఎత్తున ప్రచారం జరగడంతో ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాల వైపు చూడలేదని చెబుతున్నారు. వరుస సెలవులు, వలసలూ పోలింగ్ శాతాన్ని దెబ్బతీశాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు డుమ్మా..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పోలింగ్‌కు డుమ్మా కొట్టినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి ఆరేడు లక్షల మందికి ఓటుహక్కు ఉన్నట్లు అంచనా. కొవిడ్ వల్ల ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించడంతో సగం మంది రాష్ట్ర, రాష్ట్రేతరులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఉన్నవారిలోనూ సుమారు 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనలేదని అంచనా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. కొన్ని రంగాల్లో ఆదివారం నుంచి మంగళవారం వరకు వరుస సెలవులు రావడమూ పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది.
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి సుమారు 15 లక్షల మంది కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వారిలో 50 శాతం మంది తిరిగొచ్చినా మిగిలినవారు అక్కడే ఉండిపోయారు. ఇక్కడికొచ్చిన వారు పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వల్ల ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని చెబుతున్నారు. చాలా కాలనీల్లో పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచే ఖాళీగానే కనిపించాయి. ఎక్కువ ప్రాంతాల్లో యువత కంటే.... వృద్ధులే అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహానగరంలోని చాలా బస్తీల్లో 60 నుంచి 70శాతం మంది ఓటు వేశారు.
కొందరికి రెండేసి ఓట్లు..