భాగ్యనగరంలో జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ - టీఈఓ ఆధ్వర్యంలో జరుగనున్నాయి. 8వ అఖిల భారత మేళాను ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఉద్యాన శాఖ సహకారంతో పూర్తి ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రదర్శనకు సందర్శకుల రాక మొదలైంది.
తరలివస్తున్న నగరవాసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్‌బంగ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి 100 పైగా స్టాళ్లు ప్రదర్శనలో కొలువు తీరాయి. దేశంలో పేరెన్నికగన్న నర్సరీలు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాయి. రసాయన అవశేషాలు ఆహారానికి ప్రత్యామ్నాయంగా అవగాహన కల్పనకు సేంద్రీయ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఆహారం పదార్థాలు అందుబాటులో పెట్టిన దృష్ట్యా తిలకించేందుకు నగరవాసులు తరలివస్తున్నారు.