grand nursery mela 2022 భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని హైదరాబాద్‌లో 12వ గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 22 వరకు పీపుల్స్‌ప్లాజాలో నిర్వహిస్తున్నారు. హర్యానా, దిల్లీ, బెంగళూరు, పుణె, కోల్‌కతా, కడియం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి పలు సంస్థలు.. తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నాయి. 150 స్టాళ్లలో.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు, మొక్కలు, కుండీలు వంటివాటిని ప్రదర్శిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనను మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారని.. విభిన్న రకాల ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.
జపాన్ దేశానికి చెందిన 'మియాజాకీ' అనే జాతికి చెందిన మామిడి పండ్లకు భారత్‌లో లక్షల రూపాయల్లో ధర పలుకుతోంది. గోల్డెన్ మ్యాంగోనా అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు ఈ రకం మామిడి పండ్లను పండించారు. 380 గ్రాముల పండును ఆన్‌లైన్‌లో పెట్టగా.. రూ.లక్ష పలికినట్లు చెప్పారు. ఆ అరుదైన రకం మామిడి మొక్కలను విక్రయించనున్నామని నర్సరీ యజమానులు తెలిపారు. గ్రాండ్ నర్సరీ మేళా ప్రవేశ రుసుం రూ.30 కాగా.. ఐదు రోజుల్లో లక్ష మంది సందర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.