రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లకు శుభవార్త చెప్పింది. గ్రామపంచాయతీల నిధులను పై అధికారుల అనుమతులు లేకుండానే, ఆయా గ్రామప్రజలు, పంచాయతీల తీర్మానం మేరకు ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామసభ ఆమోదం మేరకు గ్రామ అవసరాలకు అనుగుణంగా ఆయా పనులను నిబంధనల మేరకు ఆర్థిక సంవత్సర కేటాయింపులకు మించకుండా మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా ఉత్తర్వుతో ఇప్పటికే పల్లె ప్రగతితో అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం పరుచుకున్న పల్లెలు ఇక ప్రగతిలోనూ మరింతగా పరుగులు పెడతాయని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వెంటనే ఉత్తర్వు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో లక్ష లోపు పనులకు డీపీఓలు, ఆపై పనులకు ఉన్నతాధికారుల అనుమతులు అవసరం ఉండేదని... తాజా ఉత్తర్వులతో ఎవరి అనుమతులు అవసరం లేకుండానే.. సంక్రమించే అధికారాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజలకు పిలుపునిచ్చారు.