ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు మొదటి దశలో నిర్వహించే ఎన్నికల కోసం శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. వాస్తవానికి 3,339 పంచాయతీల్లో మొదటి విడతలో ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. 33,496 వార్డు సభ్యుల స్థానాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రస్తుతం 992 వార్డులు తగ్గాయి. పెద్ద పంచాయతీల్లో రిటర్నింగ్ అధికారులను, మిగతా చోట్ల సహాయ రిటర్నింగ్, స్టేజి-1 అధికారులను కలెక్టర్లు నియమించగా వీరికి గురువారం శిక్షణ ఇచ్చారు.
తొలి దఫాలో ఎన్నికలు జరిగే చోట్ల శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వివిధ జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తులను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో గురువారం కొన్ని మార్పులు చేశారు.
*విజయనగరం జిల్లాలో మొదటి దశలో ఎక్కడా ఎన్నికలు జరగవు. రెండో విడతలో పార్వతీపురం, మూడు, 4 దశల్లో విజయనగరం డివిజన్‌లో నిర్వహించనున్నారు.
*ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్‌లో మొదటి దశలో 20 మండలాల్లో నిర్వహించాల్సిన ఎన్నికలను 15కు కుదించారు. మిగిలిన ఐదు మండలాల్లోని పంచాయతీలను రెండో దశలో చేర్చారు.
*విశాఖపట్నం జిల్లాలో తొలి విడతలో 344 పంచాయతీల్లో ఎన్నికలు జరపాలని అధికారులు తొలుత ప్రతిపాదించారు. కోర్టు కేసుల కారణంగా నాలుగింటిని మినహాయించి.. 340కి పరిమితం చేశారు.
*పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లోని గోపాలపురం మండలానికి మూడో దశకు బదులుగా రెండో దశలో ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏలూరు డివిజన్‌లో చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం మండలాల్లోని పంచాయతీలకు నాలుగో దశకు బదులుగా మూడో విడతలో ఫిబ్రవరి 17కు మార్చారు.