ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వచ్చే నెల నుంచి దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టనుంది. ప్రస్తుత సీజన్‌లో సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిధుల సమీకరణపై ప్రణాళిక రూపొందిస్తోంది.
ఈ సారి సన్న రకం ధాన్యం పెద్దఎత్తున వస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో గరిష్ఠంగా 37 లక్షల ఎకరాల్లో సన్నరకం వేశారని అధికారులు చెబుతున్నారు.
దేశ, విదేశాల్లో డిమాండ్ ఉన్న సన్న రకం ధాన్యాన్ని సాగు చేయాలన్న సీఎం కేసీఆర్ సూచనకు రైతులు సానుకూలంగా స్పందించారు. అధికారుల అంచనా ప్రకారం సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్నరకం ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుత సీజన్‌లో ఎ-గ్రేడ్ ధాన్యం మద్దతు ధర క్వింటాకు రూ.1,888, సాధారణ రకం రూ.1,838గానూ కేంద్రం నిర్ణయించింది.
యాసంగిలో పెద్దసంఖ్యలో..
వచ్చే నెల 15వ తేదీ నుంచి కొనుగోలు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా గత యాసంగిలో సుమారు ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో సింహభాగం గ్రామాల్లో వీటిని ఏర్పాటుచేశారు. పెద్దసంఖ్యలో ఏర్పాటు చేయడంతో సమన్వయ లోపం తలెత్తి కొంత ఇబ్బంది ఏర్పడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. యాసంగితో పోలిస్తే ఈ దఫా ఎక్కువ మొత్తంలోనే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.
- ధాన్యం కొనుగోలు అంశంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. కొనుగోలు కేంద్రాలతోపాటు సన్న ధాన్యం విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేయనున్నారు. ఇప్పటి వరకు సన్నాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. రైతులు కూడా భారీగా సాగు చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ఈ దఫా పరిస్థితి భిన్నంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చూడండి: మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'