తెలంగాణ

telangana

ETV Bharat / state

Grain Stocks: మిల్లుల్లో ధాన్యం నిల్వలు అస్తవ్యస్తం..

Grain Stocks: రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్లుల్లో ధాన్యం నిల్వలను లెక్కించేందుకు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖల అధికారులు చేసిన రెండో ప్రయత్నంలోనూ పాత కథే కనిపించింది. తెలంగాణలోని 2,320 మిల్లుల్లో ధాన్యం నిల్వలను లెక్కించేందుకు శ్రీకారం చుట్టారు.

Grain Stocks
Grain Stocks

By

Published : May 3, 2022, 6:01 AM IST

Grain Stocks: రాష్ట్రంలోని ఎక్కువ శాతం రైసు మిల్లుల్లో మళ్లీ అదే కథ పునరావృతం అవుతోంది. లెక్కించేందుకు సాధ్యం కాని రీతిలో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో అధికారుల బృందం చేతులెత్తేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్లుల్లో ధాన్యం నిల్వలను లెక్కించేందుకు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖల అధికారులు చేసిన రెండో ప్రయత్నంలోనూ పాత కథే కనిపించింది. తెలంగాణలోని 2,320 మిల్లుల్లో ధాన్యం నిల్వలను లెక్కించేందుకు రెండు శాఖల అధికారులు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. గతంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన సమయంలో కొన్ని చోట్ల ధాన్యం నిల్వలు తక్కువగా ఉండగా మరికొన్ని చోట్ల లెక్కించేందుకు వీలు లేకుండా నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖలకు ఎఫ్‌సీఐ లేఖ రాసింది. మరోదఫా తనిఖీలు చేస్తామని, అప్పటిలోగా నిల్వలను సక్రమమైన విధానంలో ఏర్పాటు చేయించాలని కోరింది. లెక్కించదగిన మొత్తంలో ఉన్న ధాన్యాన్నే కేంద్ర కోటా(సెంట్రల్‌ పూల్‌) కింద తీసుకుంటామని ఎఫ్‌సీఐ లేఖలో స్పష్టం చేసింది.

కుప్పలుకుప్పలుగా ధాన్యం:రైసు మిల్లుల్లో ఇప్పటికే భారీ మొత్తంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. గత యాసంగి, ఇటీవల ముగిసిన వానాకాలం పంటలను ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో సామర్థ్యానికి మించి మిల్లులకు పౌరసరఫరాల శాఖ కేటాయించింది. దీంతో మిల్లర్లు ఓ క్రమపద్ధతిలో నిల్వ చేయకుండా అస్తవ్యస్తంగా ఉంచారు. వీటికితోడు ప్రస్తుత యాసంగి సీజనులో ఇప్పుడిప్పుడే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. గత ఏడాది యాసంగి సీజనుకు సంబంధించి బియ్యం ఇచ్చేందుకు మరో నెల గడువు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతికి ఎఫ్‌సీఐ ప్రధాన కార్యాలయం నుంచి స్పందనలేదు. దీనికి సంబంధించి గతంలో పొడిగించిన గడువు ఏప్రిల్‌ 30తో పూర్తయిన విషయం తెలిసిందే. ఎఫ్‌సీఐకి సుమారు ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details