కష్టార్జితం.. కళ్ల ముందే నీళ్లపాలు...
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగులగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాక్టర్ సాయంతో కాల్వ తీస్తున్న రైతులను ఈ చిత్రంలో చూడవచ్చు. ఇక్కడ 5,130 బస్తాల ధాన్యం కొని 20 రోజుల క్రితమే తూకం వేశారు. కానీ లారీలు, గోనెసంచులు లేవని పంపలేదు. ఇవికాక అంతక్రితమే వచ్చిన మరో 8,428 బస్తాలను ఇంకా తూకం వేయలేదు. వీటిలో 2,000 బస్తాల ధాన్యం వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు ఈ కేంద్రం చెరువులా మారడంతో ట్రాక్టర్ తెచ్చి నీరు బయటికి పోవడానికి రైతులే కాల్వలు తీయించారు. కళ్లముందే కష్టార్జితం పాడైపోతుంటే వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు భయపడినంతా జరిగింది. వర్షాలు వచ్చేస్తున్నాయ్.. ధాన్యం కొనండి మొర్రో అంటూ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి బారులు తీరినా.. ఎదురుచూపులు చూసినా ఫలితం లేకపోయింది. బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ధాన్యం తడిసిపోయి రైతులు అల్లాడుతున్నారు. పలు కేంద్రాల్లో వేల బస్తాల ధాన్యం నీటమునిగింది.
చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలను పొలాల్లోనే పల్లపుప్రాంతాల్లో ఏర్పాటుచేయడంతో అవి చెరువుల్లా మారిపోయాయి. ఈ నీటిని బయటకు పంపి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల సిమెంటు చప్టాల మీద కాకుండా నేలపైనే ధాన్యపు రాశులు, బస్తాలు ఉంచడంతో నానిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ కొనుగోలు కేంద్రంలో కొద్దిరోజుల క్రితం వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యం (Grain soak)లో మొలకలు వచ్చేశాయని రైతులు వాపోతున్నారు.
కొనకుండా జాప్యం...
ఈ జిల్లాలో 200 బస్తాల ధాన్యం తడిసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో 3 కొనుగోలు కేంద్రాల్లో వెయ్యి బస్తాల ధాన్యం తడిసిపోయిందని జిల్లా అధికారులు తెలిపారు. చాలా కేంద్రాల్లో వేలాది బస్తాలుండటంతో ఎంత తడిసింది, అందులో ఎంత ధాన్యం రంగు మారి పాడవుతుందనే లెక్కలపై అధికారులు ఏమీ చెప్పడం లేదు. వర్షాలు తగ్గాక మళ్లీ ఆరబోస్తే సరిపోతుందని రైతులకు ఉచిత సలహాలిస్తున్నారు. నెల రోజులుగా ఇలా ఆరబోస్తూనే ఉన్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు నష్టం లేదని పైకి చెబుతున్న అధికారులు వెంటనే దాన్ని కొనకుండా మరింత జాప్యం చేస్తున్నారు. దీనివల్ల మళ్లీ మళ్లీ కురుస్తున్న వర్షాలకు ధాన్యం రంగు మారి పాడవుతోంది.
రాస్తారోకో...