హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాల్లో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఓటరు నమోదు కోసం గురువారం.. ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీచేస్తారు. అక్టోబర్ ఆరు వరకు ఓటరునమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.
డినావా విధానంలో..
శాసనమండలి ఎన్నికలు జరిగే ప్రతిసారి డినోవా విధానంలో కొత్త ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అంటే ఎన్నిక జరిగినప్పుడల్లా ఓటర్ల జాబితా మొత్తాన్ని తయారు చేయాల్సిందే. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసిన వారు.. మళ్లీ తమ ఓటుహక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 నవంబర్ ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్హత తేదీకి మూడేళ్లు ముందు పట్టభద్రులై ఉండాలి. అంటే 2017 నవంబర్ ఒకటో తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.