తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగో రోజు కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

మూడు రోజులైనా పట్టభద్రుల ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడలేదు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, నల్గొండ-వరంగల్‌- ఖమ్మం స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఈ రాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

graduate mlc elections votes counting continue till now
నాలుగో రోజు కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

By

Published : Mar 20, 2021, 6:47 AM IST

ఈనెల 14న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 17 నుంచి కొనసాగుతోంది. రెండు స్థానాల్లో ఎవరికీ సగానికిపైగా ఓట్లు రాకపోవటంతో ఎలిమినేషన్​ ప్రక్రియ కొనసాగిస్తూ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. వరంగల్​-నల్గొండ-ఖమ్మంలో ఇప్పటి వరకు 66 మంది... హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​లో ​76 మంది చొప్పున అభ్యర్థులను తొలగించి లెక్కిస్తున్నారు. ‘హైదరాబాద్‌’లో తెరాస, భాజపా అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ప్రతి రౌండులోనూ తెరాస ఆధిక్యత కనబరిచినప్పటికీ.. వ్యత్యాసం చాలా తక్కువ ఉండటం ఆసక్తిని పెంచుతోంది. గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,68,520 ఎవరికీ దక్కకపోవడంతో అభ్యర్థులను తొలగిస్తూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. తాజాగా తెరాస అభ్యర్థి వాణీదేవి తన ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుపై 8,175 ఓట్ల మెజారిటీలో ముందున్నారు. మూడో స్థానంలో ప్రొ.నాగేశ్వర్‌ ఉన్నారు.

రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న

‘నల్గొండ’ స్థానంలో తొలి ప్రాధాన్యంలో గెలుపు కోటా అయిన 1,83,167 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో శుక్రవారం ఉదయం నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తున్నారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 25,209‬ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఓట్ల లెక్కింపు క్రతువును త్వరగా పూర్తి చేసేందుకు అదనంగా మరో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ఆర్వో ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలోని ఎనిమిదో హాల్‌లో ఓ పోలీస్‌ అధికారి బ్యాలెట్‌ బాక్స్‌ నుంచి రెండు బ్యాలెట్‌ పత్రాలను బయటకు తీసుకువచ్చారని ఆరోపిస్తూ తీన్మార్‌ మల్లన్న ఏజెంట్లు కొద్దిసేపు ఆందోళన చేశారు. చెల్లని ఓట్ల బ్యాలెట్లను తెరాస అభ్యర్థికి అనుకూలంగా వేసుకుంటున్నారని ఆరోపించారు. బ్యాలెట్‌ పత్రాలు బయటికి వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ రెండు తమ ఆధీనంలోనే ఉన్నాయని ఎస్పీ రంగనాథ్‌ వెల్లడించారు.

ఏమిటీ తొలగింపు (ఎలిమినేషన్‌)?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యంలో గెలుపు కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో విజేతను రెండో ప్రాధాన్య ఓటును లెక్కించడం ద్వారా నిర్ణయిస్తారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు పొందిన వారిని గుర్తించి వారి బ్యాలెట్‌ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వచ్చిందో ఆ అభ్యర్థికి ఆ ఓట్లను జమ చేస్తారు. అనంతరం ఆయన్ను లెక్కింపు ప్రక్రియ నుంచి క్రమపద్ధతిలో తప్పిస్తారు(ఎలిమినేషన్‌). రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సూచన మేరకు అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో తొలగింపు అభ్యర్థుల జాబితా తయారు చేశారు. దాని ఆధారంగా వారందరికీ సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. అలా కోటా ఓట్లు పొందే వరకు లేదా ఒక అభ్యర్థి మాత్రమే ఉండే వరకు తొలగింపు ప్రక్రియను చేపట్టనున్నారు. ఇలా గురువారం ఉదయానికి నల్గొండలో 66 మందిని, హైదరాబాద్‌లో 65 మందిని తొలగించారు. అంటే నల్గొండలో 71మంది బరిలో ఉండగా వారి నుంచి 62 మందిని తొలగించి 9 మంది అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తున్నారు. హైదరాబాద్‌ స్థానంలో 93 నుంచి 59 మందిని తొలగించి 28 మంది రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తున్నారు.

నల్గొండ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో 47 మంది అభ్యర్థులకు తొలి ప్రాధాన్య ఓట్లు కేవలం 100 లోపు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్‌ స్థానంలో 93 మంది అభ్యర్థుల్లో 52 మంది అభ్యర్థులకు 100 లోపే తొలి ప్రాధాన్య ఓట్లు లభించాయి. రెండు చోట్లా కలిపి 42,945 చెల్లని ఓట్లు పోలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details