తెలంగాణ

telangana

ETV Bharat / state

హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం - telangana varthalu

ఐటీఐఆర్​, ఉద్యోగ కల్పన, విభజన హామీలు, పెరుగుతున్న ధరలే అస్త్రాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అధికార, విపక్ష నేతలు పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం
హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం

By

Published : Mar 6, 2021, 7:47 PM IST

హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... ప్రచార జోరు పెరుగుతోంది. రెండు స్థానాల్లో గెలుపు కోసం అధికార తెరాస నేతలు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పలు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లిన మాజీ మంత్రి జోగు రామన్న... అధ్యాపకులను కలిసి తెరాస అభ్యర్థి సురభి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. భద్రాచలంలో కళాశాలలు, పాఠశాలల్లో పర్యటించిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి తెరాస అభ్యర్థి పల్లాకు ఓటేయాలని అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా కల్లూర్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య... పల్లాను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. నిధులివ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడుగడుగునా అడ్డుకుంటోందని చీఫ్‌ విప్‌ వినయభాస్కర్‌ వరంగల్‌లో విమర్శించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 10 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరితే కనీసం ఒకటి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

పీవీని విమర్శించిన వారే..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటించారు. అనారోగ్యంతో ఉన్న జిల్లా నాయకుడు దుర్గాప్రసాద్‌ను పరామర్శించారు. ఉద్యమసమయంలో పీవీని విమర్శించిన నాయకులు..ఇప్పుడు పీవీ ఫోటోతో ఎన్నికల్లో గెలివాలని ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు.

యువత నిరుద్యోగులుగా..

తెరాస, భాజపాల తీరువల్లే రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని కాంగ్రెస్‌ ప్రచారం నిర్వహిస్తోంది. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మార్నింగ్‌ వాకర్స్‌ను కలిశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధి కల్పనలో తెరాస వైఫల్యం చెందిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం నుంచి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రచారం చేస్తారని తెలిపారు. ఖమ్మం లోక్​సభ పరిధిలో తాను సైకిల్‌పై ప్రచారయాత్ర చేపడతానని భట్టి విక్రమర్క ప్రకటించారు.

నిరంకుశ పాలనకు చరమగీతమే..

తెరాసను ఓడించడమంటే నిరంకుశ పాలనకు చరమగీతం పాడటమేనని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం వ్యాఖ్యానించారు. తెరాస చేస్తున్న మోసాలు గమనించి... పట్టభద్రులు ఓటువేయాలని కోరారు.

ఇదీ చదవండి: 'వాళ్ల మాటలు సర్కారు డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి'

ABOUT THE AUTHOR

...view details